
- కన్ఫెషన్ రిపోర్ట్లో సంచలన విషయాలు
- 1988 బ్యాచ్‌మేట్స్‌తో కలిసి దందాలు
- అట్లూరి నీరజ అసలు పేరు.. డాక్టర్ నమ్రత పేరుతో మోసాలు
- పిల్లలు లేని దంపతులను నమ్మించి సరోగసీ పేరుతో 30 లక్షల దాకా వసూలు
- కొన్ని కేసుల్లో చికిత్స చేయకుండానే డబ్బులు కలెక్ట్
- కొనసాగుతున్న సిట్ విచారణ
పద్మారావునగర్, వెలుగు: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత తాను తప్పుచేసినట్టు పోలీసుల విచారణలో అంగీకరించారు. డాక్టర్ నమ్రత కన్ఫెషన్ రిపోర్ట్‌లో గోపాలపురం స్టేషన్ పోలీసులు కీలక అంశాలు నమోదు చేశారు. సరోగసీ పేరిట సంతానం కలగని వందల మంది దంపతులను మోసం చేసినట్టు డాక్టర్ నమత్ర ఒప్పుకున్నారు. బాధిత దంపతుల వద్ద నుంచి గరిష్టంగా రూ.30 లక్షల వరకు వసూలు చేసినట్టు అంగీకరించారు. ఆమె అసలు పేరు అట్లూరి నీరజ అయినా.. ‘డాక్టర్ నమ్రత’ అనే నకిలీ పేరుతో ఇన్నేండ్లపాటు ఫెర్టిలిటీ సెంటర్ కార్యకలాపాలు నిర్వహించినట్టు తేలింది. ఈ కేసులో డాక్టర్ నమ్రత కొడుకు, న్యాయవాది జయంత్ కృష్ణ కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు.
బ్యాచ్ మేట్స్తో కలిసి సరోగసీ దందా
అట్లూరి నీరజ అలియాస్ డాక్టర్ నమ్రత ఏపీలోని ఆంధ్రా మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివారు. అనంతరం 1998లో విజయవాడలో మొట్టమొదటి ఫెర్టిలిటీ సెంటర్‌ను ప్రారంభించారు. 2007లో సికింద్రాబాద్‌లో రెండు ఫెర్టిలిటీ సెంటర్స్, విశాఖపట్నంలో ఒక సెంటర్‌ను ఓపెన్ చేశారు. 1988 బ్యాచ్ మేట్స్తో కలిసి సరోగసీ దందాకు తెరలేపారు. సంతానం కలగని దంపతుల వద్ద నుంచి సరోగసీ పేరుతో రూ.-30 లక్షల వరకు వసూలు చేశారు. ఒక్కోసారి చికిత్స చేయకుండానే డబ్బులు తీసుకున్నట్టు ఒప్పుకున్నారు.
గర్భిణులకు డబ్బు ఆశ చూపించి, ప్రలోభపెట్టి.. ప్రసవం తర్వాత వారి నుంచి పిల్లలను కొనుగోలు చేశారు. అబార్షన్ చేసుకోవాలనుకున్న మహిళలకు సైతం డబ్బు ఆశ చూపించి డెలివరీ తర్వాత నగదు ఇచ్చి చిన్నారులను కొనుగోలు చేసినట్టు పోలీసులు విచారణలో గుర్తించారు. ఆ పిల్లల కొనుగోలులో సంజయ్, నందిని అనే దంపతులు కీలక పాత్ర పోషించారని డాక్టర్ నమ్రత వెల్లడించారు. అలా కొనుగోలు చేసిన పిల్లలను సరోగసీ కోసం వచ్చిన దంపతులకు ఇచ్చినట్టు తెలిపారు. ఫెర్టిలిటీ, సరోగసీకి సంబంధించిన ఫైళ్లను వారికి ఇవ్వకుండా తన కన్సల్టెన్సీ రూమ్‌లోనే భద్రపరిచినట్టు వెల్లడించారు.
ఈ క్రమంలో తనపై మహారాణిపేట పోలీసు స్టేషన్‌లో 4 కేసులు, విశాఖ 2 టౌన్‌లో ఒకటి, గోపాలపురం పీఎస్‌లో 5, గుంటూరు కొత్తపేట పోలీసు స్టేషన్‌లో ఒక కేసు నమోదైనట్టు తెలిపారు. 2020లో మహారాణిపేట పీఎస్‌లో నమోదైన కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌కు సైతం వెళ్లినట్టు వెల్లడించారు. పేద గర్భిణుల వద్ద నుంచి ప్రసవం తర్వాత పిల్లల్ని కొనుగోలు చేయడంలో సంతోషి కీలక పాత్ర పోషించినట్టు తెలిపారు.
సికింద్రాబాద్ సెంటర్‌లో కృష్ణ (సూపర్‌వైజర్ కమ్ ఫార్మసిస్ట్), పద్మ (రిసెప్షనిస్ట్), అర్చన, మేరీ సోనా (టెలీకాలర్స్), సురేఖ (నర్స్), ప్రభాకర్ (ల్యాబ్ టెక్నీషియన్), చెన్నారావు (ఎంబ్రాయోలాజిస్ట్), డాక్టర్ సంయుక్త, డాక్టర్ శ్రీవాణి, విశాఖ సెంటర్ లో కల్యాణి (మేనేజర్), రమ్య (ల్యాబ్ టెక్నీషియన్), విజయవాడలో డాక్టర్ మధులత, డాక్టర్ వై.కిశోర్‌బాబు, డాక్టర్ కరుణ, పూర్ణరావు (రిసెప్షనిస్ట్), మల్లిక (నర్స్), సదానందమ్ (అనస్థీషియా) కీలక పాత్ర పోషించారని తెలిపారు.
సిట్ దర్యాప్తు ముమ్మరం
ఈ కేసును ఇప్పటికే నార్త్ జోన్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)కు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ కేసులో 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే, డాక్టర్ నమ్రత అలియాస్ అట్లూరి నీరజపై ఇప్పటికే 15కి పైగా కేసులు నమోదయ్యాయి. సరోగసీకి వచ్చిన రాజస్థాన్ దంపతులకు వారికి పుట్టిన సంతానంగా ఇచ్చిన చిన్నారిపై అనుమానం వచ్చి వారు డీఎన్ఏ టెస్టులు చేయించగా.. డాక్టర్ నమ్రత, సృష్టి ఫర్టిలిటీ సెంటర్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో చేసిన అక్రమాలు, మోసాలపై సైతం పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతున్నది.