65 పెట్రోలింగ్​ పాయింట్లలో.. 26పై పట్టుకోల్పోయిన భారత్

65 పెట్రోలింగ్​ పాయింట్లలో.. 26పై పట్టుకోల్పోయిన భారత్

రూపొందించిన లేహ్​ ఎస్పీ 

న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక సంచలన నివేదిక బయటికి వచ్చింది. తూర్పు లడఖ్​ బార్డర్​లోని 65 పెట్రోలింగ్​ పాయింట్లలో 26 పెట్రోలింగ్​ పాయింట్లపై భారత సైన్యం పట్టును కోల్పోయిందని ఆ రిపోర్టులో ఉందంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. సీనియర్​ ఐపీఎస్​ ఆఫీసర్​, లేహ్​– లడఖ్ రీజియన్​ ఎస్పీగా వ్యవహరిస్తున్న పి.డి.నిత్య ఈ రిసెర్చ్​ పేపర్​ను రూపొందించారు.  గత వారం ఢిల్లీ వేదికగా ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ దోవల్​ సమక్షంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు డీజీపీలు, ఇన్​స్పెక్టర్​ జనరళ్ల సమావేశం జరిగింది.

ఆ సందర్భంగానే లడఖ్​ బార్డర్​లో చైనా ఆగడాలపై తాను రూపొందించిన రిపోర్ట్​ను ఎస్పీ పి.డి.నిత్య సమర్పించారు.
“తూర్పు లడఖ్​ సరిహద్దులో ఫెన్సింగ్​ లేని..  ప్రజలు నివసించని.. భారత భూభాగంపై పట్టుకోసం చైనా పాకులాడుతోంది. ప్రస్తుతం కారకోరం కనుమ నుంచి చుముర్ వరకు 65 బార్డర్​ పెట్రోలింగ్​ పాయింట్స్​ ఉన్నాయి. వీటిలో 26 చోట్ల మనం గ్రిప్​ కోల్పోయాం. చైనా చేతిలోకి వెళ్లిపోయిన వాటిలో 5 నుంచి 17, 24 నుంచి 32, 37,51, 52, 62 నంబర్​ పెట్రోలింగ్​ పాయింట్లు ఉన్నాయి. దీనివల్ల వాటి సమీపంలోని పాయింట్లపై కూడా చైనా పట్టు పెరుగుతుంది. ఒక్కో ఇంచుగా భూ ఆక్రమణ పెంచుకునేందుకు చైనా సైన్యం అనుసరించే ఈ ప్లానింగ్​ను ‘సలామీ స్లైసింగ్​’ అంటారు. తదుపరి వ్యూహంలో భాగంగా.. తాము ఆక్రమించుకున్న పెట్రోలింగ్​ పాయింట్లలో కూడా భారత సైన్యం కదలికలను చైనా సైన్యం అనుమతించకపోవచ్చు” అని ఎస్పీ పి.డి.నిత్య  వివరించారు.