
- మెడపై కత్తిపెట్టి రేప్ చేశారు.. మీర్‌పేట్ గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు
- తమ్ముళ్లపై దాడిచేసి అక్కపై అత్యాచారం.. అరిస్తే చంపేస్తామని నిందితుల బెదిరింపులు
- ఇద్దరు కాపలా.. ముగ్గురి అఘాయిత్యం
- మరో ఇద్దరి సహకారంతో పరార్
- ఏడుగురు నిందితుల అరెస్టు
హైదరాబాద్/ఎల్బీ నగర్, వెలుగు: హైదరాబాద్‌లోని మీర్‌పేట నందనవనంలో జరిగిన మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక గొంతుపై కత్తిపెట్టి దుండగులు అత్యాచారం జరిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రౌడీషీటర్ సహా మొత్తం ఏడుగురిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్‌పేట గ్యాంగ్ రేప్ కేసు వివరాలను రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ మంగళవారం మీడియాకు వెల్లడించారు.
తల్లిదండ్రులను కోల్పోయి తమ్ముళ్లను పోషిస్తూ
లాలాపేటలో నివాసం ఉంటున్న మైనర్ బాలిక (16) తల్లి చనిపోయింది. ఆమెకు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. వారందరినీ తండ్రి వదిలేశాడు. పది రోజుల క్రితం మీర్‌పేట నందనవనం రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్న అక్క వరుసయ్యే బంధువు ఇంటికి బాలిక వెళ్లింది. అదే గృహకల్పలో ఇబ్రహీంపట్నంకు చెందిన మంకల మహేశ్ (17), ఎం.నర్సింగ్ (23), అష్రఫ్ (20) వివిధ బ్లాకులలో నివాసం ఉంటున్నారు. వారిలో మహేశ్ లేబర్ గా, నర్సింగ్ బ్యాండ్ వర్కర్‌గా, అష్రఫ్ ప్రయివేట్ వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. వారికి మంగళ్‌హాట్ సీతారాంపేటకు చెందిన రౌడీషీటర్ ఆబెద్ బిన్ ఖలీద్ (35) స్నేహితుడు. గంజాయి, మద్యానికి బానిసైన ఆబెద్.. తన అనుచరుడు తాసీన్ అలియాస్ టైసన్‌తో కలిసి రాజీవ్ గృహకల్పకు అప్పుడప్పుడు వెళ్లివస్తుంటాడు. ఈ క్రమంలో నందవనం పరిసర ప్రాంతాల్లో ఆబెద్, టైసన్ మద్యం, గంజాయి కొనుగోలు చేస్తున్నారు. మహేశ్, నర్సింగ్, అష్రఫ్, ఆబెద్, టైసన్ అందరూ కలిసి గృహకల్పలో మద్యం, గంజాయి సేవించేవారు. ఈ క్రమంలోనే గత శనివారం కూడా ఆబెద్ రాజీవ్ గృహకల్పకు వెళ్లాడు. మైనర్ బాలిక తన కంట పడడంతో ఆమెతో అతను అసభ్యంగా ప్రవర్తించాడు.
ఈ విషయం బాధితురాలు తన సోదరికి చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఇద్దరూ బెదిరించారు. దీంతో బాలికపై ఆబెద్ కక్ష పెంచుకున్నాడు. తాసీన్, మహేశ్, నర్సింగ్‌తో కలిసి ఆమెపై అత్యాచారం చేయాలని ప్లాన్ చేశాడు. ఓల్డ్ మలక్‌పేటలో ఫ్లవర్ సెల్లర్‌గా పనిచేస్తున్న మహ్మద్ ఫైజల్ (21), మహ్మద్ ఇర్ఫాన్ (20) కు విషయం చెప్పాడు. ఆదివారం రాత్రి ఆబెద్, తాసీన్ రాజీవ్ గృహకల్పకు వెళ్లారు. స్థానికంగా గంజాయి కొన్నారు. అవకాశం కోసం ఎదురుచూశారు. .
సోమవారం ఉదయం బాలిక సోదరి పనికి వెళ్లడం గమనించారు. ఉదయం11 గంటల సమయంలో బాలిక ఉన్న బ్లాక్‌లోకి వెళ్లారు. ఆబెద్, తాసీన్, మహేశ్ ఆ ఇంట్లోకి ప్రవేశించి బాలికను కొట్టారు. అక్కడే ఉన్న ఆమె తమ్ముళ్లపైనా దాడి చేశారు. ఆమె తమ్ముళ్లను ఓ రూమ్‌లో బంధించారు. అరిస్తే చంపేస్తామని బెదిరించారు. బాలిక జుట్టు పట్టుకుని బెడ్‌రూమ్‌లోకి ఈడ్చుకెళ్లి నోరు మూశారు. బాధితురాలి గొంతుపై కత్తి పెట్టి ఒకరి తరువాత ఒకరు ముగ్గురూ అత్యాచారం చేశారు. ఫైజల్, ఇర్ఫాన్ రూమ్ బయట కాపలాగా ఉన్నారు.
8 స్పెషల్ టీమ్స్‌తో గాలించిన పోలీసులు
అత్యాచారం జరిపిన తరువాత మహేశ్, ఆబెద్, తాసీన్, ఫైజల్, ఇర్ఫాన్, నర్సింగ్, అష్రఫ్ పారిపోయారు. అనంతరం బాధితురాలు తన సోదరికి ఫోన్ చేసి జరిగిన ఘోరం గురించి వివరించింది. వెంటనే సోదరి తన ఇంటికి చేరుకున్నది. స్థానికులతో కలిసి ఇద్దరూ మీర్‌పేట పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా గ్యాంగ్‌రేప్, పోక్సో సహా ఇతర సెక్షన్ల కింద పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.
వారిని పట్టుకునేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. మహారాష్ట్రకు పారిపోయేందుకు యత్నించిన ఆబెద్, మహేశ్ ను కలబురగిలో అరెస్టు చేశారు. నర్సింగ్, అష్రఫ్, ఫైజల్, ఇమ్రాన్, తాసీన్ ను హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో పట్టుకున్నారు. గంజాయి మత్తులోనే గ్యాంగ్‌రేప్ జరిగిందని పోలీసులు వెల్లడించారు. నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తామన్నారు. నందనవనంతో పాటు శివారు ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించామని చెప్పారు.