ఏడాది చివరి రోజు స్టాక్ మార్కెట్ల భారీ లాభాలు.. దూకుడు ర్యాలీకి 5 కారణాలు ఇవే..

ఏడాది చివరి రోజు స్టాక్ మార్కెట్ల భారీ లాభాలు.. దూకుడు ర్యాలీకి 5 కారణాలు ఇవే..

వరుస నష్టాలతో బెంబేలెత్తించిన స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఏడాది చివరి రోజున భారీగా ఊరటను అందించింది. గత ఐదు రోజులుగా కొనసాగుతున్న పతనానికి బ్రేక్ వేస్తూ.. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఉక్కు దిగుమతులపై మూడేళ్లపాటు సేఫ్‌గార్డ్ డ్యూటీ విధిస్తున్నట్లు ప్రకటించడంతో మెటల్ స్టాక్స్ మార్కెట్‌ను పరుగులు పెట్టించాయి. బుధవారం ట్రేడింగ్ సమయానికి సెన్సెక్స్ 668.04 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 219.35 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతున్నాయి.

మార్కెట్ పరుగుకు ప్రధాన కారణాలు ఇవే:

1. ఉక్కు రంగంలో జోష్: 

విదేశీ ఉక్కు దిగుమతులపై కేంద్రం 12 శాతం వరకు అదనపు సుంకం విధించడంతో దేశీయ స్టీల్ కంపెనీలకు భారీ ప్రయోజనం చేకూరనుంది. దీనివల్ల టాటా స్టీల్ 2.2%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 3.3%, జిందాల్ స్టీల్ 3.6% చొప్పున లాభపడ్డాయి. ఈ నిర్ణయం దేశీయంగా స్టీల్ ధరలకు మద్దతునిస్తుందన్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి.

2. తగ్గిన చమురు ధరలు: 
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర స్వల్పంగా తగ్గి బ్యారెల్‌కు 61.27 డాలర్లకు చేరుకుంది. భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశానికి చమురు ధరలు తగ్గడం ద్రవ్యోల్బణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది మార్కెట్‌కు సానుకూల అంశంగా నిలుస్తోంది.

ALSO READ : జపాన్ అవుట్.. భారత్ ఇన్

3. కనిష్టాల వద్ద కొనుగోళ్లు: 
గత 5 ట్రేడింగ్ సెషన్లలో మార్కెట్ భారీగా పడిపోవడంతో, అనేక క్వాలిటీ స్టాక్స్ ఆకర్షణీయమైన ధరలకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ట్రేడర్లు 'బార్గెన్ బయింగ్' అంటే తక్కువ ధరలో మంచి స్టాక్స్ కొనుగోలుకు మొగ్గు చూపారు. ముఖ్యంగా మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ షేర్లలో బలమైన కొనుగోళ్ల ఆసక్తి కనిపించింది.

4. తగ్గిన ఒడిదుడుకులు: 
మార్కెట్ భయాన్ని సూచించే 'ఇండియా VIX' సూచీ 3 శాతం తగ్గి 9.37 వద్దకు చేరింది. ఇది ఇన్వెస్టర్లలో ఆందోళన తగ్గిందని, రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని సూచిస్తోంది.

5. జీడీపీ ఎదుగుదల:
అలాగే భారత జీడీపీ జపాన్ ను అధిగమించటంతో ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇండియా మారిందనే వార్త కూడా ఇన్వెస్టర్లలో కొత్త జోష్ నింపిందని చెబుతున్నాయి మార్కెట్ వర్గాలు.

మార్కెట్ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (FIIs) నిరంతర అమ్మకాలు అడ్డంకిగా మారాయని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ వ్యూహకర్త డాక్టర్ వి.కె. విజయకుమార్ చెప్పారు. మరోవైపు నిఫ్టీ 26,027 పాయింట్ల స్థాయిని దాటితేనే స్పష్టమైన సానుకూల ధోరణి కనిపిస్తుందని టెక్నికల్ అనలిస్టులు చెబుతున్నారు.