దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు పతనాన్ని చవిచూశాయి. బుధవారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయానికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించడంతో, సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు నష్టాలతో ప్రయాణాన్ని ముగించాయి. ముఖ్యంగా జొమాటో, ట్రెంట్, ఎయిర్ టెల్ వంటి షేర్లలో జరిగిన అమ్మకాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
దీంతో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 275 పాయింట్ల నష్టంతో ప్రయాణాన్ని ముగించగా.. నిఫ్టీ సూచీ 81 పాయింట్లు కోల్పోయింది క్లోజింగ్ నాటికి. గత మూడు సెషన్లలో జరిగిన తీవ్రమైన కరెక్షన్ కారణంగా ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరైంది. BSE మార్కెట్ క్యాపిటలైజేషన్ నుంచి సుమారు రూ. 8 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోగా.. దాని విలువ రూ.463 లక్షల కోట్లకు తగ్గింది.
నేడు సెన్సెక్స్‌ను దెబ్బతీసిన వాటిలో జొమాటో స్టాక్ అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత Trent , Bharti Airtel, Infosys , Tech Mahindra, UltraTech Cement కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే ఐటీ, క్యాపిటల్ గూడ్స్ షేర్లు నష్టాల్లో నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.
ALSO READ : 2026లో షార్ట్‌కట్స్ వద్దు: కొత్తగా క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేసేవాళ్లకు టిప్స్ ఇవే..
ఈక్విటీ మార్కెట్లలో అస్థిరత కొనసాగుతున్న వేళ, జపాన్ బాండ్ ఈల్డ్స్ పెరుగుదల, బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య కఠినత సంకేతాలు అంతర్జాతీయంగా రిస్క్-ఆఫ్ సెంటిమెంట్‌ను పెంచుతున్నాయని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ఇప్పుడు అందరి దృష్టి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై ఉందని, అక్కడ 25 బేసిస్ పాయింట్ల కోత ప్రకటనపై అంచనాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు నాయర్. అయితే ఎక్కువ మంది మాత్రం 2026లో వడ్డీ రేట్ల ప్లాన్ గురించి ఫెడ్ ఏమని చెబుతుందా అనే అంశంపైనే ఫోకస్ పెడుతున్నారు. వాస్తవానికి ఇది మార్కెట్లకు పెద్ద మార్గనిర్థేశాన్ని ఇస్తుందని చెబుతున్నారు.
కొద్ది రోజులుగా భారతీయ మార్కెట్లు కూడా గ్లోబల్ భయాలకు అనుగుణంగా స్పందించాయని, ఎఫ్ఐఐ నిరంతర పెట్టుబడుల ఉపసంహరణ, రూపాయి బలహీనత, యూఎస్-ఇండియా వాణిజ్య చర్చల చుట్టూ ఉన్న అనిశ్చితి మార్కెట్‌ను మరింత ప్రభావితం చేస్తున్నాయని నాయర్ వివరించారు.

