- రాణించిన బ్యాంకింగ్, ఐటీ షేర్లు
- రూ.8,160 కోట్ల విలువైన షేర్లను అమ్మిన ఎఫ్‌ఐఐలు
ముంబై: మార్కెట్ వరుసగా మూడో సెషన్‌లోనూ లాభాల్లో కదిలింది. క్రూడాయిల్ ధరలు నిలకడగా ఉండడం, పశ్చిమాసియాలో యుద్ధం విరమణ దిశగా చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు రావడంతో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సోమవారం ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్లు పెరగడం, రూపాయి బలపడటం కలిసొచ్చింది. సెన్సెక్స్ 787.30 పాయింట్లు (1.07శాతం) పెరిగి 74,106.85 వద్ద ముగిసింది.
ఇంట్రాడేలో ఇది 887.91 పాయింట్లు (1.21శాతం) పెరిగి 74,207.46 వరకు చేరుకుంది. బీఎస్‌ఈలో 3,207 స్టాక్స్ పెరగగా, 1,147 తగ్గాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.10 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్‌ఈ లిస్డెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.421 లక్షల కోట్లకు చేరింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 255.15 పాయింట్లు (1.12శాతం) లాభపడి 22,968.25 వద్ద క్లోజ్ అయింది. ‘‘ఇరాన్–అమెరికా మధ్య సీజ్‌ఫైర్ ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయనే వార్తలు మార్కెట్‌ను లేపాయి. క్రూడ్ ధరలు స్థిరంగా ఉండడంతో గ్లోబల్‌గా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడింది” అని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్–ప్రెసిడెంట్(రీసెర్చ్) అజిత్ మిశ్రా తెలిపారు.
ట్రెంట్ 7.89శాతం పెరిగి సెన్సెక్స్‌లో టాప్ గెయినర్‌గా నిలిచింది. యాక్సిస్ బ్యాంక్, టైటాన్, లార్సెన్ అండ్ టూబ్రో, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ముగియగా, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా మాత్రం తగ్గాయి. సెక్టార్ల వారీగా చూస్తే, బీఎస్‌ఈ పీఎస్‌యూ బ్యాంక్ 2.37శాతం, కన్జూమర్ డ్యూరబుల్స్ 2.30శాతం, ప్రైవేట్ బ్యాంకెక్స్ 2.15శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.12శాతం, బ్యాంకెక్స్ 2.03శాతం, యుటిలిటీస్ 1.94శాతం లాభపడ్డాయి. ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లు మాత్రం తగ్గాయి.
- ఉదయం ప్రాఫిట్ బుకింగ్
బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సోమవారం లాభాల్లో ఓపెన్ అయినప్పటికీ, మార్నింగ్ సెషన్‌లో ప్రాఫిట్ బుకింగ్ వల్ల ఒత్తిడి ఏర్పడిందని, అయితే మధ్యాహ్నం సెషన్‌లో కొనుగోళ్లు పెరగడంతో ఇండెక్స్‌లు లాభాల్లోకి వచ్చాయని చాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ టెక్నికల్ ఎనలిస్ట్ హితేష్ టైలర్ అన్నారు. “దేశీయ ఈక్విటీలు బలమైన ర్యాలీ చేశాయి. మిడిల్ ఈస్ట్‌లో సీజ్‌ఫైర్ ఆశలు, క్రూడ్ ధరలు తగ్గుతుండడం, రూపాయి బలపడటంతో రేట్ సెన్సిటివ్ సెక్టార్లపై ఫోకస్ పెరిగింది” అని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు.
అయితే ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, గ్లోబల్ ట్రేడ్‌లో ఆటంకాల వల్ల ఇన్వెస్టర్లు జాగ్రత్త వహిస్తున్నారని తెలిపారు. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ సోమవారం 0.71శాతం తగ్గి బ్యారెల్‌కు108.3 డాలర్ల దగ్గర ట్రేడవు తోంది. రూపాయి డాలర్‌తో 28 పైసలు బలపడి 92.90 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లలో సౌత్ కొరియా కొస్పీ, జపాన్ నిక్కీ 225 లాభపడ్డాయి. హాంకాంగ్, షాంఘై మార్కెట్లకు సెలవు. ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) గురువారం నికరంగా రూ.9,931.13 కోట్ల విలువైన షేర్లను అమ్మగా, సోమవారం మరో రూ.8,160 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.
