
- సెన్సెక్స్ 880 పాయింట్లు పతనం
- 266 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- భారీగా నష్టపోయిన ఫైనాన్షియల్, యుటిలిటీ షేర్లు
న్యూఢిల్లీ: భారత్, -పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ శుక్రవారం ఒక శాతానికి పైగా పతనమయ్యాయి. ముఖ్యంగా రియల్టీ, ఫైనాన్షియల్, యుటిలిటీ స్టాక్స్ భారీగా పడ్డాయి. సెన్సెక్స్ శుక్రవారం 880.34 పాయింట్లు లేదా 1.10 శాతం క్షీణించి 79,454.47 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈలో 2,522 స్టాక్స్ నష్టాల్లో ముగియగా, 1,343 స్టాక్స్ లాభపడ్డాయి. 145 స్టాక్స్‌లో ఎటువంటి మార్పు లేదు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 265.80 పాయింట్లు లేదా 1.10 శాతం తగ్గి 24,008 వద్ద ముగిసింది. గురువారం రాత్రి, భారత్‌లోని జమ్మూ, పఠాన్‌కోట్‌తో సహా వివిధ సైనిక స్థావరాలపై డ్రోన్‌లు, క్షిపణులతో పాక్ దాడులు జరిపింది.
ఈ దాడులను ఇండియా సమర్ధవంతంగా తిప్పికొట్టింది. “ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతుందని అంచనా వేసినప్పటికీ, పరిస్థితులు ఇంత తీవ్రమవుతాయని మార్కెట్ ఊహించలేదు. ఉద్రిక్తతలు ఎంత కాలం కొనసాగుతాయోననే ఆందోళనలు పెరిగాయి. అయినప్పటికీ, పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చూస్తే ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు. మరోవైపు ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (ఎఫ్‌ఐఐలు) ఇప్పటికీ ఇండియా స్టాక్ మార్కెట్‌లో నికర కొనుగోలుదారులుగా కొనసాగుతున్నారు.
రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం జాగ్రత్త పడుతున్నారు” అని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ తెలిపారు. సెన్సెక్స్ కంపెనీలలో ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్‌సర్వ్, అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్‌టీపీసీ షేర్లు శుక్రవారం ఎక్కువగా నష్టపోయాయి. రిజల్ట్స్ బాగుండడంతో టైటాన్, ఎల్ అండ్ టీ షేర్లు దాదాపు 4 శాతం లాభపడ్డాయి. టాటా మోటార్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏషియన్ పెయింట్స్ పాజిటివ్‌గా కదిలాయి. మొత్తంగా ఈ వారం సెన్సెక్స్ 1,047.52 పాయింట్లు లేదా 1.30 శాతం, నిఫ్టీ 338.7 పాయింట్లు లేదా 1.39 శాతం పడ్డాయి.
సానుకూలంగా గ్లోబల్ మార్కెట్లు
“భారత్, -పాకిస్తాన్ మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రమవడంతో మార్కెట్‌లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి” అని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా తెలిపారు. ఎఫ్‌ఐఐలు గురువారం రూ.2,007.96 కోట్ల విలువైన షేర్లను కొనగా, శుక్రవారం మాత్రం రూ.3,800 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. గ్లోబల్‌గా చూస్తే సౌత్ కొరియా కోస్పీ, షాంఘై ఎస్‌ఎస్ఈ కాంపోజిట్ సూచీలు శుక్రవారం క్షీణించగా, జపాన్ నిక్కీ 225, హాంగ్ కాంగ్ హాంగ్ సెంగ్ లాభాల్లో ముగిశాయి.
యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. యూకేతో ట్రేడ్ డీల్ కుదరనుండడం, చైనాతో అమెరికా టారిఫ్ చర్చలు జరపనుండడంతో యూఎస్ మార్కెట్లు శుక్రవారం పాజిటివ్‌గా కదిలాయి. బ్రెంట్ క్రూడాయిల్ 1.53 శాతం పెరిగి బ్యారెల్‌కు 63.80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్ మారకంలో రూపాయి విలువ 17 పైసలు బలపడి 85.39 కు చేరింది.
డిఫెన్స్ షేర్లు జూమ్
భారత్-, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ, ఇండియా డిఫెన్స్ కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు బంపర్ లాభాలిస్తున్నాయి. డ్రోన్‌ల తయారీ కంపెనీల షేర్లు శుక్రవారం 17 శాతం వరకు పెరిగాయి. ఐడియాఫోర్జ్, డ్రోన్‌ఆచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్, జెన్ టెక్నాలజీస్ వంటి స్టాక్స్ ర్యాలీ చేశాయి. సైనిక కొనుగోళ్లు పెరుగుతాయని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు. బీఎస్‌ఈలో ఐడియాఫోర్జ్ టెక్నాలజీ షేర్లు శుక్రవారం దాదాపు 17 శాతం పెరిగి రూ.450కి చేరాయి.
లాహోర్, ముల్తాన్‌లలో భారత సైన్యం సూసైడ్ డ్రోన్‌లను ఉపయోగించి పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను నాశనం చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో, డ్రోన్‌ఆచార్య షేర్లు 5 శాతం, జెన్ టెక్నాలజీస్ 5 శాతం, పారస్ డిఫెన్స్ దాదాపు 5శాతం లాభపడ్డాయి. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఇండియా డిఫెన్స్ బడ్జెట్ రూ.6.81 లక్షల కోట్లు. ఇందులో రూ.1.8 లక్షల కోట్లు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కోసం కేటాయించారు. ఈ ఖర్చులు మరింత పెరగొచ్చని అంచనా.