మనకు తుఫాన్ గండం తప్పింది : ఇండోనేషియా వైపు వెళుతున్న సెన్యార్

మనకు తుఫాన్ గండం తప్పింది : ఇండోనేషియా వైపు వెళుతున్న సెన్యార్

ఇటీవలి భారీ వర్షాలకు అతలాకుతలమై కోలుకుంటున్న తెలుగు రాష్ట్రాలకు వాతావరణ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంలా మారి వర్షాలు పడే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో.. తుఫాన్ గండం తప్పినట్లు పేర్కొంది వాతావరణ కేంద్రం. సెన్యార్ తుఫాన్ మలక్కా జలసంధి మీదుగా ప్రయాణిస్తున్నట్లు బుధవారం (నవంబర్ 26) ప్రకటనలో తెలిపింది. 

సెన్యార్ తుఫాన్ ఉత్తర ఇండోనేషియా వైపు ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత 6 గంటలుగా 10 కిలోమీటర్ల వేగంతో ఇండోనేషియా దేశం దిశగా కదులుతున్నట్లు పేర్కొన్నారు. ఇండోనేషియాలోని కూటా మంమ్కూర్ ప్రాంతానికి 100 కి.మీ. దూరంలో, మలేషియాలోని జార్జ్ టౌన్ కు 260 కి.మీ. దూరంలో అదే విధంగా అండమాన్ నికోబార్ దీవులకు 740 కి.మీ టర్ల దూరంలో ఉన్నట్లు పేర్కొన్నారు. 

రానున్న 24 గంటల్లో తుఫాన్ బలహీనపడుతుందని తెలిపారు. ఇవాళ (నవంబర్ 26) ఇండోనేషియా దిశగా వెళ్తున్న తుఫాన్.. 48 గంటల్లో పశ్చిమదిశగా ప్రయాణించి బలహీన పడుతుందని తెలిపారు. దీంతో కోస్తా ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ర్టాలు తుఫాను ముప్పు నుంచి బయటపడ్డాయని తెలిపారు. 

అయితే బంగాళాఖాతంలో మలేషియా, మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన ఈ  అల్పపీడనం  48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని IMD ఇప్పటికే ప్రకటించింది. దీని ప్రభావంతో తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, అండమాన్ & నికోబార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని గత రెండు రోజులుగా హెచ్చిరస్తూ వ చ్చింది. వాయుగుండంగా మారుతుందనుకున్న అల్పపీడనం ఉత్తర ఇండోనేషియా వైపు ప్రయాణిస్తుండటంతో తెలుగు రాష్ట్రాలకు ముప్పు తప్పినట్లు పేర్కొంది.