
ముషీరాబాద్, వెలుగు: నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించిన సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విమోచన దినమే అని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దత్తాత్రేయ మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానాన్ని నాటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశంలో విలీనం చేసిన రోజునే ఇక్కడి ప్రజలకు విముక్తి దక్కిందని చెప్పారు.
మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, రిటైర్డ్ వీసీ ప్రొఫెసర్ తిరుపతిరావు, ప్రొఫెసర్ మురళీ మనోహర్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహనరావు, బీజేపీ సీనియర్ లీడర్ డాక్టర్ మనోహర్ రెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు విఠల్ రావు ఆర్య, సీనియర్ జర్నలిస్టులు పాశం యాదగిరి, కప్పర ప్రసాదరావు, సఫాయి కర్మచారి కమిషన్ మాజీ సభ్యుడు చింతా సాంబమూర్తి పాల్గొన్నారు.
అధికారికంగా నిర్వహించాలి..
మెహిదీపట్నం : సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినంగా ప్రకటించి, అధికారికంగా వేడుకలు జరుపాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బద్దం మహిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం గుడిమల్కాపూర్ లోని బీజేపీ ఆఫీసులో కార్వాన్ ఇన్చార్జి అమర్ సింగ్ తో కలిసి ఆయన మాట్లాడారు. బుధవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న విమోచన దినోత్సవానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరవుతున్నట్లు తెలిపారు. బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్కన్వీనర్ ఇంద్రసేనారెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి యోగిరాజ్ సింగ్, నాయకులు పూర్ణచందర్, రాజు, శ్రీకాంత్ పాల్గొన్నారు.
భారీ ఏర్పాట్లు
కూకట్పల్లి: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర కన్వీనర్, కూకట్పల్లి నియోజకవర్గ ఇన్చార్జి మాధవరం కాంతారావు తెలిపారు. కూకట్పల్లి బీజేపీ ఆఫీసులో మాట్లాడుతూ విమోచన దినోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు.శ్రీకర్రావు, సురేంద ర్రెడ్డి, రమేశ్, కిరణ్, విజయ పాల్గొన్నారు.