కామారెడ్డి జిల్లాకు సెప్టెంబర్ రేషన్ కోటా 6,159 టన్నులు.. గతంతో పోలిస్తే 255 టన్నులు పెంపు

కామారెడ్డి జిల్లాకు సెప్టెంబర్ రేషన్ కోటా 6,159 టన్నులు.. గతంతో పోలిస్తే 255 టన్నులు పెంపు
  •  కామారెడ్డి జిల్లాకు పెరిగిన కార్డులు 26 వేలు
  •  షాపులకు చేరుతున్న బియ్యం

కామారెడ్డి, వెలుగు: జిల్లాకు సెప్టెంబర్ ​రేషన్ ​కోటా రిలీజ్​అయింది. రేషన్​కార్డులున్న లబ్ధిదారులకు జూన్​, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి ఇచ్చారు. మూడు నెలల తర్వాత మళ్లీ సెప్టెంబర్​1 నుంచి బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈసారి కొత్తగా కార్డు పొందినవారికి, పాత కార్డుల్లో చేరిన వారికీ ఇవ్వనున్నారు. ఎంఎల్ఎస్​ పాయింట్ల నుంచి బియ్యం రేషన్​ షాపులకు చేరుతున్నాయి.    

ఏండ్లుగా ఎదురుచూపులు

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేండ్లు ఎంతోమంది పేదలు రేషన్​కార్డుల కోసం ఎదురుచూశారు. కానీ ఫలితం లేకపోయింది. కాంగ్రెస్​అధికారంలోకి వచ్చాక కొత్తగా కార్డులతో పాటు గతంలో ఉన్న కార్డుల్లో లేని వారి పేర్లను చేర్చే పక్రియ చేపట్టింది. ప్రజాపాలన గ్రామసభలు, మీసేవలో చేసుకున్న దరఖాస్తులను రెవెన్యూ అధికారులు పరిష్కరించారు. ఫలితంగా గత నెలలో లబ్ధిదారులు కొత్త కార్డులు అందుకున్నారు.   

 కొత్త రేషన్ కార్డులు 26,521.. 

జిల్లాలో కొత్తగా 26,521 రేషన్​కార్డులు జారీ అయ్యాయి. వీటికి సంబంధించిన లబ్ధిదారులు 42,440 మంది. కొత్త వాటితో కలిపి మొత్తం కార్డుల సంఖ్య 2,83,253, సభ్యుల సంఖ్య 9,21,169 మందికి చేరింది. గతంలో జూన్​ నెల కోటా రిలీజ్​కు కార్డుల సంఖ్య  2,56,752 ఉన్నాయి.  గతంలో  2,56,752 కార్డులుంటే నెల రేషన్​కోటా 5,903 టన్నులు రిలీజ్ అయ్యేది. పెరిగిన లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా సెప్టెంబర్ నెలకు 255.57 టన్నుల కోటా అదనంగా పెరిగింది. ప్రస్తుతం 6,159 టన్నుల బియ్యం ఇవ్వనున్నారు.