ట్యాక్సీ డ్రైవర్లను చంపి బాడీలను అడవుల్లోడంప్ చేసిండు..25 ఏండ్ల తర్వాత నిందితుడి అరెస్టు

ట్యాక్సీ డ్రైవర్లను చంపి బాడీలను అడవుల్లోడంప్ చేసిండు..25 ఏండ్ల తర్వాత నిందితుడి అరెస్టు
  • ఆపై నేపాల్ సరిహద్దుల్లో డ్రైవర్ల వెహికల్స్  అమ్మిండు

న్యూఢిల్లీ: అతను ట్యాక్సీ డ్రైవర్ ను కిరాయికి మాట్లాడుకునేవాడు. కొద్ది దూరం వెళ్లాక డ్రైవర్ ను మాటల్లో పెట్టి చంపేసేవాడు. అనంతరం డెడ్ బాడీని సమీపంలోని అడవుల్లో డంప్  చేసేవాడు. డ్రైవర్  వాహనంతో పారిపోయి నేపాల్  సరిహద్దుల్లో అందినకాడికి వెహికల్ ను అమ్ముకునేవాడు. ఇలా వచ్చిన డబ్బుతో జల్సా చేసేవాడు. ఇదీ ఢిల్లీకి చెందిన అజయ్  లాంబా అలియాస్  బన్షీ నేపథ్యం. 1999 నుంచి 2001 మధ్య అజయ్  పలు హత్యలు చేశాడు. పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ఇతను ఎట్టకేలకు 25 ఏండ్ల తర్వాత దొరికాడు.

 ఢిల్లీ, ఉత్తరాఖండ్ లో ఇతనిపై దోపిడీ, మర్డర్  కేసులు ఉన్నాయి. ఢిల్లీలోని కృష్ణా నగర్ లో 1976లో పుట్టిన  అజయ్  మధ్యలోనే బడి మానేశాడు. తర్వాత పలు నేరాల్లో పాల్గొన్నాడు. దీంతో పోలీసులు అతడిపై బ్యాడ్  క్యారెక్టర్ గా ముద్రవేసి అతని పేరును బన్షీగా మార్చారు. 1996లో బన్షీ తన పేరును అజయ్  లాంబాగా మార్చుకొని యూపీలోని బరేలీకి మారాడు. అక్కడ కూడా నేరాలు చేయడం మానలేదు. కొంతమంది సహాయకులను పెట్టుకొని ట్యాక్సీ డ్రైవర్లను మాట్లాడుకున్నాడు. 

మార్గం మధ్యలో డ్రైవర్ ను చంపి వారి మృతదేహాలను అడవుల్లో డంప్  చేశాడు. వారి వెహికల్ ను నేపాల్  సరిహద్దుల్లో అమ్మేశాడు. ఇలా  1999 నుంచి 2001 వరకు మొత్తం నలుగురిని అజయ్  హత్య చేశాడు. ఢిల్లీ, హల్ద్ వనీ, అల్మోరా, చంపావత్ లో అతనిపై కేసులు నమోదయ్యాయి. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరిగాడు. ఈ క్రమంలో పలు ఊళ్లు మారాడు. 2008 నుంచి 2018 వరకు తన ఫ్యామిలీతో నేపాల్​లో నివసించాడు. 

తర్వాత డెహ్రాడూన్​కు మకాం మార్చాడు. అలాగే, 2020లో డ్రగ్స్  స్మగ్లింగ్  కూడా చేశాడు. ఒడిశా నుంచి ఢిల్లీతో పాలు పలు ప్రాంతాలకు గంజాయి సరఫరా చేసే గ్యాంగ్ తో కలిసి పనిచేశాడు. 2021, 2024లో ఒడిశాలోని బెర్హాంపూర్​లో  డ్రగ్స్  కేసుల్లో అరెస్టయ్యాడు. తర్వాత బెయిల్​పై రిలీజ్  అయ్యాడు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులకు అతని గురించి తెలియడంతో అజయ్​ను ఢిల్లీలో అరెస్టు చేశారు.