ఏడుపాయల్లో వరుసగా విషాదాలు

ఏడుపాయల్లో వరుసగా విషాదాలు
  • ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో మృత్యు ఘోష 
  • వనదుర్గామాత దర్శనానికి వచ్చిన భక్తులు నీట మునిగి మృతి
  • రెండున్నరేళ్లలో 22 మంది మృత్యు ఒడికి 
  • స్నానాలకు సరైన వసతులు లేక పోవడమే కారణం

మెదక్​, పాపన్నపేట, వెలుగు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయలలో వరుస విషాద ఘటనలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దైవ దర్శనానికి వస్తున్నభక్తులు ప్రమాదవశాత్తు నీటమునిగి చనిపోతున్నారు. సరైన రక్షణ చర్యలు , అనుకూలమైన స్నాన ఘట్టాలు లేకపోవడంతోనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

 మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధి ఏడుపాయలలో కొనువైన వన దుర్గా భవానీ ఆలయం రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా, పర్యటక ప్రదేశంగా వెలుగొందుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​తోపాటు  కర్నాటక, మహారాష్ట్ర నుంచి సైతం ఏడాది పొడుగునా భక్తులు తరలివస్తారు. ఆది, మంగళ, శుక్రవారాలు ఇతర సెలవు రోజుల్లో, ముఖ్యంగా సమ్మర్​ హాలిడేస్​ లో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు, మొక్కులు చెల్లించుకునేందుకు కుటుంబ సమేతంగా వస్తారు.  

దర్శనానికి వెళ్లేముందు మంజీర నదీ పాయల్లో స్నానాలు చేస్తారు. ఈ క్రమంలో పలువురు భక్తులు ప్రమాదవశాత్తు  నీట మునిగి మృతి చెందుతున్నారు.  ఆలయ సమీపంలోని చెక్ డ్యాం  వద్ద, వనదుర్గా ప్రాజెక్ట్​ (ఘనపూర్​ ఆనకట్ట) వద్ద, ఫతేనహర్​ కాలువ వద్ద నీటి మునిగి చనిపోతున్నారు. ఆయా చోట్ల స్నాన ఘట్టాలు సరిగా లేకపోవడం, నదీ, కాలువ ఎక్కడ ఎంతలోతుందో  తెలియక స్నానాలు చేసేందుకు నీటిలో దిగి బండరాళ్ల మధ్య ఇరుక్కొని మృతి చెందుతున్నారు.

 ఏటా పదుల సంఖ్యలో భక్తులు చనిపోతున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని భక్తుల ఆరోపిస్తున్నారు.  ఆలయానికి ఏటా కోట్ల రూపాయలు ఆదాయం సమకూరుతున్నా భక్తులు ప్రమాదాల  భారిన పడకుండా స్నానాలు చేసేందుకు వీలుగా కనీస సౌకర్యాలు కల్పించకపోవడం మరణాలకు కారణమవుతోంది.  2022 నుంచి ఇప్పటి వరకు గడచిన రెండున్నరేళ్ల కాలంలో ఏడుపాయల్లో 22 మంది భక్తులు నీట మునిగి ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.  

ప్రమాదాలిలా...

  • ఈ నె 26వ   పెద్ద శంకరంపేట చెందిన రజనీ కుమార్​ కుటుంబ సభ్యులతో కలిసి ఏడుపాయలకు విందుకు వచ్చాడు. రాత్రి అక్కడే ఉన్నారు. మరుసటి రోజు ఉదయం ముఖం కడుక్కునేందుకు చెక్​డ్యాంకు వద్దకు వెళ్లిన రజనీ కుమార్​ నీట మునిగి మృతి చెందాడు. అదే రోజు స్నేహితులతో కలిసి ఏడుపాయలకు వచ్చిన మేడ్చల్​ జిల్లా నిజాంపేటకు చెందిన వేణుబాబు చెక్​డ్యాం వద్ద స్నానం చేస్తుండగా నీట మునిగి చనిపోయాడు.
  •  ఈ 24న  మేడ్చల్ జిల్లా సూరారంకు చెందిన చెందిన కావలి విజయ్ (40) చెక్​ డ్యాంలో నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు.
  •  2022 ఏప్రిల్​ 12న మనోహరాబాద్​ మండలం దండుపల్లికి చెందిన పిట్టల జయింద (45) కుటుంబ సభ్యులతో కలసి ఏడుపాయల్లో బందువుల విందుకు వచ్చారు. జయిందతో పాటు ఆయన అన్న కోడుకులు రాము, రమేష్​ చెక్​ డ్యాంలో స్నానానికి దిగారు.  ప్రమాదవశాత్తు ముగ్గురు నీటిలో మునుగుతుండగా అక్కడున్న వారు గుర్తించి రమేష్​ ను రక్షించగా,  జయింద, రాములు నీట మునిగి మృతి చెందారు. 
  •  గతంలో హైదరాబాద్​ కు చెందిన ఒక కుటుంబం హోలీ పండగ రోజు ఏడుపాయలకు రాగా ఒకరి వెనక ఒకరు నీట మునిగి ముగ్గురు అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు. 

చర్యలు చేపడుతున్నాం
 
భక్తులకు మంజీరా లో లోతట్టు ప్రాంతాలు తెలియక నీట మునిగి చనిపోతున్నారు. చెక్ డ్యాం వద్ద ఎక్కువ ఘటనలు జరగుతున్నాయి. స్నానాలు చేసే భక్తులు నది లోనికి వెళ్లకుండా చర్యలు చేపడుతున్నాం. లోతుగా ఉండే ప్రదేశంలోకి వెళ్లకుండా జాలీలు ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నాము త్వరలోనే ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభిస్తాం.

సాతెల్లి బాలా గౌడ్, ఆలయ చైర్మన్