పంటలకు అగ్గి పెట్టుకోండి రైతులపై ఏఈ గుస్సా

పంటలకు అగ్గి పెట్టుకోండి రైతులపై ఏఈ గుస్సా
  • కరెంట్​ కోసం రోడ్డెక్కిన రైతులు
  • కోతలు నిరసిస్తూ భైంసాలో ధర్నా 

 భైంసా : నిర్మల్ జిల్లా భైంసాలో కరెంటు కోతలు నిరసిస్తూ ఇవాళ రైతులు ఆందోళనకు దిగారు. నిర్మల్ రోడ్డు మార్గంలో విద్యుత్ సబ్ స్టేషన్ ముందు భైంసా మండలం కత్ గాం రైతులు ధర్నా చేశారు. దీంతో  ధర్నా వద్దకు వచ్చిన ఏఈ రాంబాబు రైతులపై గుస్సా అయ్యారు. రైతులు తమ పంటలకు కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయని, కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘‘పంటలకు అగ్గి పెట్టుకోవాలని.. మేమేం చేయలేం’’అని ఏఈ సూచించారు. 

దీంతో ఆయనపై రైతులు కన్నెర్ర చేశారు. అధికారులు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతకుముందు రైతులు మాట్లాడుతూ వ్యవసాయానికి 10 గంటల కరెంటు కూడా రావడం లేదన్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో,  ఎప్పుడు వెళ్తుందో అర్థం కావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  చేతికందే దశలో ఉన్న మొక్కజొన్న పంటలకు చివరి సాగు నీరు అందక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 విద్యుత్ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. విద్యుత్ అధికారులకు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. పంటలకు నీరు అందకపోతే తామంతా అప్పులపాలు అవుతామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల వద్దకు రూరల్ ఏఈ రాంబాబు  చేరుకొని సముదాయించే ప్రయత్నం చేయగా.. రైతులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారిస్తామని హమీచ్చారు. కాగా.. రైతుల ధర్నాతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.