- మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్, వెలుగు : మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో పట్టణంలో సెట్విన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. గురువారం ఆయన స్థానిక సెట్విన్ కేంద్రాన్ని సందర్శించి టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్, కంప్యూటర్ విభాగాల్లో శిక్షణ పొందుతున్న మహిళలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు భవిష్యత్లో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కంపెనీల ద్వారా ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అమరచింత తరహాలోనే మక్తల్‌లో కూడా ప్రత్యేక షెడ్లు నిర్మించి మహిళా కార్మికులకు చేతినిండా పని కల్పిస్తామని, అలాగే ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫాంలను కుట్టే బాధ్యతను సెట్విన్ శిక్షణ పూర్తి చేసుకున్నవారికి అప్పగించి వారికి ఆర్థిక భరోసా కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేలా మక్తల్ సెట్విన్ కేంద్రానికి వివిధ ప్రాంతాల నుంచి ఆర్డర్లు వచ్చేలా తీర్చిదిద్దుతామని, మహిళలు ఈ నాణ్యమైన శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెట్విన్ జిల్లా కోఆర్డినేటర్ విజయ్ కుమార్, శిక్షకులు ఫర్జానా, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
