దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగులకు ఏడు అవార్డులు

దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగులకు ఏడు అవార్డులు
  • రేపు ఢిల్లీలో అవార్డులు ప్రదానం చేయనున్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
  • అవార్డు గ్రహితలకు జీఎం అభినందన

హైదరాబాద్, వెలుగు: జాతీయ స్థాయిలో ‘అతి విశిష్టమైన రైలు సేవా పురస్కార్ – 2023’ కు దక్షిణ మధ్య రైల్వే జోన్​లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులకు ఏడు అవార్డులు దక్కాయి. ఈ అవార్డులను డిసెంబర్ 15న ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అందజేయనున్నట్లు బుధవారం సీపీఆర్ వో  రాకేష్ పత్రిక ప్రకటనలో తెలిపారు.

అవార్డులు పొందిన వారిలో  ఖాజీపేటలో డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న డీఎస్ రామారావు, విజయవాడలో పనిచేస్తున్న సీనియర్ డివిజన్ ఎలక్ర్టికల్ ఇంజనీర్ దినేష్ రెడ్డి,  సికింద్రాబాద్ డీఆర్ఎంగా ఉన్న శ్రీకాంత్,  సిగ్నల్, టెలీ కమ్యూనికేషన్ ఇంజనీర్ గా పనిచేస్తున్న శివకుమార్ కశ్యప్, నిజామాబాద్ లో ఆర్ పి ఎఫ్ ఎస్ ఐ గా పనిచేస్తున్న ప్రత్యూష, సికింద్రాబాద్ లో చీఫ్ టికెట్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న నటరాజన్, బీదర్ లో  ట్రాక్ మెయింటెయినర్ గా పనిచేస్తున్న రంగయ్య లు ఉన్నారు. ఈ ఏడుగురు అధికారులు వివిధ సందర్భాల్లో ప్రమాదాలు జరగకుండా పనిచేశారని సీపీఆర్వో తెలిపారు. అవార్డు గ్రహీతలను  జీఎం  అరుణ్ కుమార్ జైన్  అభినందించారు. వీరిని ఆదర్శంగా తీసుకొని ఇతర ఉద్యోగులు, అధికారులు పనిచేయాలన్నారు. జాతీయ స్ధాయిలో అవార్డులు సాధించి జోన్ కు పేరు ప్రఖ్యాతలు తెచ్చారని జీఎం బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.