బోథ్, వెలుగు: పత్తి చేన్లలో పత్తి పంటతోపాటు సోలార్బ్యాటరీలను దొంగిలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు బోథ్ సీఐ డి.గురుస్వామి తెలిపారు. సోమవారం ఆయన పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. మండలంలోని కౌట'బి' గ్రామంలోని పత్తి చేనుల్లో వరుసగా దొంగతనాలు చోటుచేసుకున్న నేపథ్యంలో గ్రామస్తుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
కౌట'బి' గ్రామానికే చెందిన సుంకరి చిలకయ్య , ఎస్కే నాసిర్, మామిడి శ్రీనివాస్, అశోక్, రాజారాప దత్తు, ఎస్కే షఫి ఓ గ్యాంగ్‌గా ఏర్పడి రాత్రి పూట పత్తి చేనుల్లో పత్తితోపాటు సోలార్బ్యాటరీల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వీరి వద్ద నుంచి వాటిని కొనుగోలు చేస్తున్న అల్లం చందర్ ను సైతం అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి 30 కిలోల పత్తి, రూ.9,600ల నగదు, బొలెరో మ్యాక్స్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్సై పురుషోత్తం, సిబ్బంది పాల్గొన్నారు.
