ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం మాదాలవారిగూడెంలో తీవ్ర విషాదం నెలకొంది. చెరువులో ఈతకు వెళ్లి ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. అందులో ఇద్దరు మృతి చెందగా.. మరో ఐదుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వివరాల ప్రకారం.. లింగయాస్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతోన్న ఏడుగురు విద్యార్థులు ఇవాళ ఆదివారం (అక్టోబర్ 20) కావడంతో సరదగా ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ విద్యార్థులు నీటిలో గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు సహయక చర్యలు ప్రారంభించి పోలీసులకు సమాచారం అందించారు.
ALSO READ | Kadapa: పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి
హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మృతులను పాలడుగు దుర్గారావు, జే వెంకటేష్ గా గుర్తించారు. మరో ఐదుగురు విద్యార్థుల కోసం ఘటన స్థలంలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో సహయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.