Womens T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌కు వేదికలు ఖరారు చేసిన ఐసీసీ.. ఫైనల్ ఎక్కడంటే..?

Womens T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌కు వేదికలు ఖరారు చేసిన ఐసీసీ.. ఫైనల్ ఎక్కడంటే..?

ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న 2026 మహిళల టీ20 ప్రపంచ కప్‌ వేదికలని ఐసీసీ ఖరారు చేసింది. ప్రపంచ కప్‌కు ఏడు వేదికలు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు గురువారం (మే 1) ఐసీసీ అధికారిక వెబ్‌సైట్ తెలిపింది. ఈ మెగా ఈవెంట్ ఫైనల్ జూలై 5న చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. మే 1న లార్డ్స్‌లో జరిగిన లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఈ ప్రకటన చేశారు. టోర్నమెంట్ ను ఎడ్జ్‌బాస్టన్, హాంప్‌షైర్ బౌల్, హెడింగ్లీ, ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్, ది ఓవల్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ మ్యాచ్‌లను నిర్వహిస్తాయని కూడా వెల్లడించారు.

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 జూన్ 12 న ప్రారంభమవుతుంది. మొత్తం 24 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో 33 మ్యాచ్ లు జరుగుతాయి. పూర్తి టోర్నమెంట్ షెడ్యూల్‌ను త్వరలోనే వెల్లడిస్తామని ఐసీసీ తెలిపింది. ప్రతిష్టాత్మక టైటిల్ కోసం మొత్తం 12 జట్లు పోటీ పడనున్నాయి. మొదట గ్రూప్ దశలో 12 జట్లను ఆరు జట్లతో రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఆ తర్వాత నాకౌట్ రౌండ్లు, ఫైనల్స్ జరుగుతాయి.

Also Read :  ముంబైకి బిగ్ షాక్.. ఐపీఎల్‎కు యంగ్ స్పిన్ సంచలనం పుత్తూర్ దూరం

ఆతిథ్య ఇంగ్లాండ్ తో పాటు ఆస్ట్రేలియా,ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ ఇప్పటికే ఐసీసీ మహిళా టీ 20 వరల్డ్ కప్ కు అర్హత సాధించాయి. వచ్చే ఏడాది జరగనున్న క్వాలిఫయర్ మ్యాచ్ ల ద్వారా మరో నాలుగు జట్లను ఎంపిక చేయనున్నారు. 2009లో తొలిసారి ప్రారంభమైన మహిళా టీ20 వరల్డ్ కప్ ఇప్పటివరకు 9 సార్లు జరిగింది. చివరిసారిగా 2024లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ను న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 32 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ఈ ట్రోఫీని అందుకుంది.