మంచిర్యాల/చెన్నూర్, వెలుగు : గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఏడో తరగతి స్టూడెంట్ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఆదివారం చనిపోయింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని గంగారం గ్రామానికి చెందిన రాళ్లబండి రమేశ్, చంద్రకళ దంపతుల కుమార్తెలు శ్రీహిందూ (13) చెన్నూరు సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతోంది.
బుధవారం సాయంత్రం శ్రీహిందూ వాంతులు చేసుకోవడంతో గమనించిన సిబ్బంది చెన్నూరు గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో గురువారం ఉదయం వారు హాస్పిటల్‌కు చేరుకున్నారు. శ్రీహిందూ పరిస్థితి విషమంగా మారడంతో శనివారం ఉదయం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు.
అక్కడ టెస్ట్‌లు చేసిన డాక్టర్లకు పాయిజన్ తీసుకున్నట్లు అనుమానం రావడంతో స్టూడెంట్‌ను అడుగగా గడ్డిమందు తాగినట్లు చెప్పింది. బాలిక పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారితో పాటు మేజిస్ట్రేట్ నిరోష హాస్పిటల్‌కు వచ్చి బాలిక వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు శ్రీహిందూ చనిపోయింది.
కాగా, బాలిక ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. అసలు స్కూల్‌లోకి గడ్డి మందు ఎలా వచ్చిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. నెల రోజుల కింద ఇంటికి వెళ్లిన శ్రీహిందూ 10 రోజుల తర్వాత స్కూల్‌కు వచ్చింది. అయితే గడ్డి మందు ఇంటి నుంచే తెచ్చుకుందా ? మరెక్కడి నుంచైనా వచ్చిందా ? అనే కోణంలో విచారణ విచారణ చేస్తున్నారు. బాలిక తండ్రి రమేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు చెన్నూర్ టౌన్ సీఐ బన్సీలాల్ తెలిపారు.
బంధువుల ఆందోళన
బాలిక మృతి సమాచారం తెలిసిన వెంటనే బంధువులు పెద్ద సంఖ్యలో హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. స్కూల్ సిబ్బంది వేధింపులు, చెన్నూరు హాస్పిటల్ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే బాలిక చనిపోయిందని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అడిషనల్ కలెక్టర్ జి.శ్రీనివాసరావు హాస్పిటల్ వద్దకు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని, ఫ్యామిలీలో ఒకరికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
