
వైభవంగా రేణుకాఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ
మెదక్ (కౌడిపల్లి), వెలుగు : మెదక్ జిల్లా
కౌడిపల్లి మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం రేణుకాఎల్లమ్మ విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. 150 జంటలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన సునీతారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రవీణ్ కుమార్, కృష్ణగౌడ్, శ్రీనివాస్ గౌడ్, దుర్గాగౌడ్, వెంకట్ గౌడ్, అశోక్ గౌడ్ పాల్గొన్నారు.
వీఆర్ఏలను ప్రభుత్వం పట్టించుకోవాలె
పాపన్నపేట, వెలుగు : తమ సమస్యలు పరిష్కరించాలని 28 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని వీఆర్ఏలు మండిపడ్డారు. పాపన్నపేటలో కొనసాగుతున్న దీక్షలో సంఘాల లీడర్లు మాట్లాడారు. రోజుకో రూపంలో నిరసనలు తెలిపినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోడం దారుణమన్నారు. వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని
హెచ్చరించారు.
మునుగోడు సభకు తరలిన బీజేపీ లీడర్లు
సంగారెడ్డి టౌన్/పటాన్ చెరు, వెలుగు: మునుగోడులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభకు సంగారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి రాజేశ్వరరావు దేశపాండే ఆధ్వర్యంలో ఆదివారం సంగారెడ్డి, కంది మండలాలతో పాటు సంగారెడ్డి టౌన్ నుంచి భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక, హుజూరాబాద్ తరహాలోనే మునుగోడు ఉప ఎన్నికల్లోనూ బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలోని బొల్లారం మున్సిపల్ నుంచి పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు టీ. రవీందర్ రెడ్డి, బొల్లారం మున్సిపల్ ప్రధాన కార్యదర్శి రోహిత్ సింగ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యకర్తలు సభకు తరలివెళ్లారు.
అనుమానాస్పదంగా యువకుడు మృతి
చేర్యాల, వెలుగు : అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు నీటి కుంటలో పడి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని ఆకునూరు గ్రామంలో జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన శనిగరం నరేశ్(33) ఐదేండ్ల నుంచి గ్రామ శివారులోని దూసపాటి సత్యనారాయణ వ్యవసాయ భూమిలో పాలేరుగా పని చేస్తున్నాడు. రోజులాగే అతడు శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి పొలం వద్దకు వెళ్లాడు. ట్రాక్టర్‌తో భూమి దున్నాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఆదివారం తెల్లవారు జామున పనిచేసే పొలం పక్కన మిద్దె బండల వద్ద నీటి కుంటలో అతడి డెడ్‌బాడీ కనిపించింది. తన కొడుకు మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి సాయిలు చేర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వెంటనే ఎస్సై భాస్కర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
ఘనంగా బోనాలు
చేర్యాల పట్టణంలో శ్రావణమాసం చివరి ఆదివారం సందర్భంగా పోచమ్మ, మైసమ్మకు ఘనంగా బోనాలు సమర్పించారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఎ. స్వరూపారాణి బోనమెత్తుకుని పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. గొల్ల, కురమలు సాంప్రదాయబద్ధంగా డోలు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా బీరప్పకు బోనాలు తీసుకెళ్లారు.
- చేర్యాల,వెలుగు
మొక్కలు నాటిన్రు...
స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్ మండల పరిధిలోని గర్ పల్లిలో అడిషనల్ కలెక్టర్ రాజర్షిషా తో కలిసి కలెక్టర్ శరత్ ఫ్రీడమ్ పార్క్ ను ప్రారంభించి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని నోవాపాన్ చౌరస్తాలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, సంగారెడ్డి సహకార మార్కెటింగ్ సంఘము లిమిటెడ్ హెడ్ ఆఫీసులో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ , కందిలో తహసీల్దార్ విజయలక్ష్మి, చేర్యాల మున్సిపల్ కేంద్రంలోని చుంచనకోట క్రాస్ రోడ్డు వద్ద చైర్ పర్సన్ ఎ. స్వరూపారాణి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి మొక్కలు నాటారు.
- వెలుగు, నెట్వర్క్
మల్లన్న ఆలయంలో భక్తుల సందడి
శ్రావణమాసం చివరి ఆదివారం కావడంతో కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఆలయప్రాంగణాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. భక్తులు స్వామి వారికి అభిషేకం చేసి, నిత్య కల్యాణంలో పాల్గొన్నారు. స్వామి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. గుట్టపై రేణుకాఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకొని ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు.
- కొమురవెల్లి, వెలుగు
దుర్గమ్మా.. దీవించమ్మా..
ఏడుపాయల వన దుర్గ భవానీ మాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ అర్చకులు వేకువ జామున అమ్మవారిని వివిధ రకాల గాజులతో అలంకరించారు. భక్తులు మంజీరా నదీ పాయలలో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పాలకమండలి, దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
- పాపన్నపేట, వెలుగు