జీపీలుగా ఏర్పడ్డ గ్రామాల్లో అనేక కష్టాలు

జీపీలుగా ఏర్పడ్డ గ్రామాల్లో అనేక కష్టాలు
  • ఖమ్మం కార్పొరేషన్ నుంచి జీపీలుగా ఏర్పడ్డ గ్రామాల్లో అనేక కష్టాలు
  • ఎన్నికల్లేక ఏళ్లుగా స్పెషల్ ఆఫీసర్ల పాలన 
  • చిన్న వర్షానికే రోడ్లు బురదమయం 
  • సీసీ రోడ్లు, డ్రైనేజీలకు దిక్కు లేదు
  • మున్సిపాలిటీ విలీన గ్రామాల్లోనూ సేమ్ సీన్​

ఖమ్మం, వెలుగు: ఖమ్మం రూరల్​ మండలంలోని పెద్దతండా, గుర్రాలపాడు, వెంకటగిరి, గుదిమళ్ల, ఏదులాపురం గ్రామ పంచాయతీలను గతంలో ఖమ్మం కార్పొరేషన్​లో విలీనం చేసి మూడేళ్ల పాటు కొనసాగించారు. ప్రజల్లో వ్యతిరేకత రావడం, స్థానిక నేతలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలతో మళ్లీ ఆ గ్రామాలను గతేడాది కార్పొరేషన్​ నుంచి తొలగించి ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కార్పొరేషన్​లో ఉన్నా, ప్రత్యేక గ్రామాలుగా ఏర్పాటు చేసినా ఆ గ్రామాల్లో ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. అప్పటి నుంచి ఎన్నికలు, ప్రత్యేక పాలక వర్గం లేకపోవడం, స్పెషలాఫీసర్ల పాలనలోనే ఏళ్ల తరబడి కొనసాగుతుండడంతో సమస్యలను పరిష్కరించే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక పంచాయతీలుగా ప్రకటించిన తర్వాత ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించినా, వివిధ కారణాలతో జరగలేదు. ఇదిలాఉంటే చిన్న వర్షాలకే ఆయా గ్రామాల్లోని మట్టి రోడ్లు బురదమయంగా మారుతున్నాయి. సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేక స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు. కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.

బురదమయంగా గ్రామాలు..

జిల్లాలో రెండు వారాలుగా వర్షాలు కురుస్తున్నాయి. మధ్యలో గ్యాప్​ వచ్చినా, మళ్లీ వర్షం కురిసినప్పుడల్లా జనాలకు బురద కష్టాలు తప్పడం లేదు. ఏదులాపురం, పెద్దతండా, గుర్రాలపాడు  పంచాయతీలతో పాటు సాయిప్రభాత్ నగర్, శ్రీరాంనగర్, మారుతీ నగర్ ఏరియాల్లో సైడ్​ డ్రెయిన్లు, సీసీ రోడ్లు పూర్తి స్థాయిలో వేయలేదు. గతంలో కార్పొరేషన్​లో విలీనం జరిగిన సమయంలో కొందరు కోర్టుకు వెళ్లడంతో అటు కార్పొరేషన్​ అధికారులు పట్టించుకోకపోవడం, విలీనం రద్దు చేసి పంచాయతీలుగా ప్రకటించినా పాలక మండళ్లు లేకపోవడం వీరికి ఇబ్బందిగా మారింది. ఎక్కువ జనాభా ఉండడంతో మళ్లీ ఒక్కో గ్రామ పంచాయతీని రెండు గ్రామాలుగా విభజించడం, రూరల్​ మండలంలో కొత్తగా మరో మండలాన్ని ఏర్పాటు చేయడం వంటి అంశాలు పరిశీలనలో ఉన్నందున ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదన్న అభిప్రాయాలున్నాయి. రాజకీయ కారణాలతో తమ సమస్యలు పెండింగ్ లో ఉంచకుండా, కనీస సౌకర్యాలు కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 

విలీన గ్రామాల్లోనూ అవే తిప్పలు

మధిర మున్సిపాలిటీ, వైరా మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామ పంచాయతీల్లోనూ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. మధిర మున్సిపాలిటీలో మడుపల్లి, ఇల్లందులపాడు, అంబారుపేట, దిగుడుపాడు గ్రామాలను గతంలో విలీనం చేశారు. వైరా మున్సిపాలిటీలో పల్లిపాడు, సోమవరం, గండగలపాడు, దిద్దుపూడి, లాలాపురం గ్రామాలను కలిపారు. పంచాయతీలుగా ఉన్నప్పుడు ఆ పాలకవర్గాలు వెంటనే సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టేవి. కానీ విలీనం తర్వాత అభివృద్ధి పేరుతో పన్నుల వసూళ్లు పెరిగినా, మున్సిపల్​ పాలకవర్గం సరిహద్దుల్లో ఉన్న తమ ప్రాంతాలను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. విలీన గ్రామాల్లో చెత్త సేకరణ దగ్గర నుంచి, సైడ్​ కాలువల నిర్వహణను పక్కన పడేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

విలీన పంచాయతీలను పట్టించుకోవాలి

స్పెషల్ ఆఫీసర్లు విలీన పంచాయతీలను పట్టించుకోవాలి. వర్షాకాలంలో రోడ్లపై నడిచే పరిస్థితి లేకుండా పోయింది. బురదతో ఇబ్బందులు పడుతున్నాం. ఏదులాపురం, పెద్దతండా, గుర్రాలపాడు  పంచాయతీల్లో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్ల వెంట చెత్త పేరుకుపోయింది. 

- మైబలీ సాహెబ్, వరంగల్ క్రాస్ రోడ్