రేషన్ కార్డులు ఎందుకియ్యలే .. ఖమ్మం జిల్లా కార్యకర్తల ఫైర్

రేషన్ కార్డులు ఎందుకియ్యలే .. ఖమ్మం జిల్లా కార్యకర్తల ఫైర్
  • ఉద్యమం నుంచి పని చేసినోళ్లకు పార్టీలో చాన్స్ ఇయ్యలే
  • తొమ్మిదిన్నరేండ్లు అధికారంలో ఉన్నా మాకు వచ్చిందేమి లేదు

హైదరాబాద్, వెలుగు: రైతుబంధు ఇవ్వాలని ఎవరు అడిగారు? మేనిఫెస్టోలో పెట్టినట్లుగా రేషన్​కార్డులు, డబుల్​బెడ్రూం ఇండ్లు ఎందుకు ఇవ్వలేదు? అంటూ బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఖమ్మం జిల్లా కార్యకర్తలు నిలదీశారు. మంగళవారం తెలంగాణ భవన్‌‌లో జరిగిన ఖమ్మం లోక్‌‌సభ సన్నాహక సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌‌రావు, ఇతర ముఖ్య నేతల సమక్షంలో పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు.

 రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూం ఇండ్లు సహా అనేక హామీలను మేనిఫెస్టోలో పెట్టారు. వాటిపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఇవ్వకపోవడంతోనే ఎన్నికల్లో ఓడిపోయాం” అని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి, అమలు చేసిన వాటి గురించి ప్రజలకు సరిగా చెప్పలేకపోయారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాలపై బీఆర్ఎస్​చెప్పిన లెక్కలను నిరుద్యోగులెవరూ నమ్మలేదని అన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో లెక్కలు పెంచి చెప్పడంతో నిజంగా భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య కూడా అబద్ధమనే అనుకున్నారని తెలిపారు. 

పార్టీ కోసం తెలంగాణ ఉద్యమకాలం నుంచి పని చేసిన వారికి అసలు అవకాశాలు దక్కలేదు. ఇతర పార్టీల్లో గెలిచిన వారిని చేర్చుకుంటే వాళ్లు పాత క్యాడర్‌‌‌‌ను కనీసం పట్టించుకోలేదు. కార్యకర్తలు, నాయకులకు పార్టీ పదవులు, నామినేటెడ్​పదవులు ఇవ్వలేదు. ఎమ్మెల్సీగా ఉన్న తాతా మధు, ఎమ్మెల్యేగా ఉన్న రేగా కాంతారావుకు జిల్లా అధ్యక్ష పదవులు ఇచ్చారు.

 ప్రజాప్రతినిధులకే జిల్లా అధ్యక్ష పదవులు ఎందుకు? ఇతర సీనియర్లకు అవకాశం ఇచ్చి ఉంటే పార్టీకి లాభం జరిగేది’’ అని కుండబద్దలు కొట్టారు. గతంలో కాంగ్రెస్​అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తలకు లాభం జరిగిందని, అదే బీఆర్ఎస్​తొమ్మిదిన్నరేండ్లు అధికారంలో ఉన్న కార్యకర్తలుగా తమకు వచ్చిందేమి లేదని, బండ్లల్లో పెట్రోల్​కూడా తామే పోయించుకొని తిరిగామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను పట్టించుకోకున్నా తెలంగాణపై ప్రేమతోనే పార్టీ కోసం పని చేశామని, ఇంకా త్యాగాలు చేసే ఓపిక తమకు లేదని తేల్చిచెప్పారు.