రజాకార్ సినిమాకు గద్దర్ అవార్డా..?..వెంటనే వెనక్కి తీసుకోవాలి లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం : ఏపీసీఆర్

రజాకార్ సినిమాకు గద్దర్ అవార్డా..?..వెంటనే వెనక్కి తీసుకోవాలి లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం : ఏపీసీఆర్

బషీర్​బాగ్, వెలుగు: రజాకార్ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డు ఇవ్వడమేంటని పలువురు వక్తలు ప్రశ్నించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్​లో గురువారం అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్(ఏపీసీఆర్) ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. వీక్షణం సంపాదకులు వేణుగోపాల్ మాట్లాడుతూ.. రజాకార్ సినిమా తెలంగాణ చరిత్ర, సంస్కృతిని వక్రీకరించిందని, ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్ అజెండాను ప్రోత్సహించిందన్నారు. ఈ సినిమాకు అవార్డు ఇచ్చి, తెలంగాణ చరిత్రను అవమానపరిచారని వ్యాఖ్యానించారు.

అవార్డును వెనక్కి తీసుకోవాలని, లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి కన్నెగంటి రవి మాట్లాడుతూ.. తెలంగాణ వాస్తవ చరిత్రను ఈ సినిమాలో చూపించలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గోషాల నిర్మాణానికి దళితుల భూములను స్వాధీనం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. పసునూరి రవీందర్, స్కైబాబా, అవరీచ్ బాణీ, అన్వర్ ఖాన్ పాల్గొన్నారు.