మెతుకు సీమను ముంచిన అకాల వర్షాలు

మెతుకు సీమను ముంచిన అకాల వర్షాలు

 

  •     కూరగాయల పంటలకూ తీరని నష్టం
  •     పిడుగుపాటుకు మూడు దూడలు మృతి
  •     ఈదురు గాలులకు షెడ్డు కూలిమరో రెండు ఆవులు..

సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వెలుగు: మెతుకుసీమ రైతులను ఆకాల వర్షం ఆగం జేసింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు కురిసిన ఉరుములు మెరుపులు, పలుచోట్ల వడగాళ్ల వానకు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.  ముఖ్యంగా మామిడి, వరి, మక్కజొన్న , సన్ ఫ్లవర్, జొన్న, ఉల్లి, అరటితో పాటు  టమాట, పచ్చిమిర్చి లాంటి కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు మామిడి కాయలు రాలిపోయాయి.  మక్కజొన్న, సన్‌‌ ఫ్లవర్ నేలకొరిగింది. అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ లో తెల్లజొన్న, ఉల్లి, మాసాయిపేట మండలం చెట్లతిమ్మాయిపల్లిలో అరటి, మామిడి తోటలకు నష్టం వాటిల్లింది.  చేగుంట మండలం రుక్మాపూర్‌‌‌‌లో టమాట తోటలు నీట మునిగి రూ.15 లక్షల విలువైన పంట దెబ్బతిన్నది. కాగా, నష్టపోయిన పంటలను అధికారులు అంచనా వేస్తున్నారు.  ఆదివారం సంగారెడ్డి జిల్లాలో కోహీర్​ ఏవో  నవీణ్​ కుమార్  మక్కజొన్న, మిర్చి, మామిడి తదితర పంటలను పరిశీలించారు. 

 వేల ఎకరాల్లో నష్టం

వ్యవసాయ, ఉద్యాన అధికారుల ప్రాథమిక అంచనా మేరకు సిద్దిపేట జిల్లాలో 1650 ఎకరాల్లో మక్కజొన్న,  200 ఎకరాల్లో సన్‌‌ ఫ్లవర్‌‌‌‌ 150 ఎకరాల్లో  వరి పంటలు, మరో 200 ఎకరాలకుపై మామిడి, కూరగాయలు నష్టపోయాయి.  సంగారెడ్డి జిల్లాలో 300 ఎకరాలు ఉల్లి , 650 ఎకరాల్లో కూరగాయలు , 520 ఎకరాల్లో మామిడి ,  50 ఎకరాల్లో వరి, 150 ఎకరాల్లో చెరుకు,  640 ఎకరాల్లో మక్కజొన్న , 185 ఎకరాల్లో జొన్న,  150 ఎకరాల్లో సోయా, 60 ఎకరాల్లో బొప్పాయి , 150 ఎకరాల్లో టమాట, 10 ఎకరాల్లో శనగ పంటలు దెబ్బతిన్నాయి.  మెదక్‌‌ జిల్లాలో 344 ఎకరాల్లో వరి , 70 ఎకరాల్లో మక్కజొన్న, 8 ఎకరాలలో పొద్దుతిరుగుడు పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.  రామాయంపేట, నిజాంపేట మండలాలలో దాదాపు 200 ఎకరాల్లో మామిడి కాయలు రాలిపోయి.. దాదాపు కోటి నష్టం వాటిల్లిందని  జిల్లా హార్టికల్చర్‌‌‌‌ ఆఫీసర్ నర్సయ్య తెలిపారు.  

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​

కోహెడ(బెజ్జంకి), వెలుగు:  ఆకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మానకొండూర్​ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ భరోసా ఇచ్చారు. ఆదివారం బెజ్జంకి మండలంలోని వీరాపూర్, లక్ష్మీపూర్​, గూడెం గ్రామాల్లో నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ  పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి నివేదిక రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు.  ఆయన వెంట ఎంపీపీ లింగాల నిర్మల, ఏఎంసీ చైర్మన్​ రాజయ్య, పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్​ రెడ్డి, నాయకులు శ్రీనివాస్​ గుప్తా, లక్ష్మణ్, శేఖర్​బాబు ఉన్నారు.

దెబ్బతిన్న కాళేశ్వరం కాలువలు.. 

భారీ వర్షానికి చేగుంట మండలం రెడ్డిపల్లి శివారులో నిర్మిస్తున్న కాళేశ్వరం కాలువల సీసీ లైనింగ్ దెబ్బతింది. చేగుంట మండలం కర్నాల్ పల్లిలో సాయిరాం, రామచంద్రాగౌడ్‌‌లు పశువుల కోసం నిర్మించిన షెడ్డు కూలి రెండు ఆవులు చనిపోయాయి.  మరో రెండు ఆవుల నడుము విరిగింది. చిలప్ చెడ్ మండలం చిట్కుల్‌‌లో ఈదురు గాలులకు బేగరి లక్ష్మి ఇంటి పై రేకులు ఎగిరిపడ్డాయి.  అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌‌‌‌లో ఈదురు గాలులు , భారీ వర్షానికి విద్యుత్ స్తంభం నేలకొరిగింది. కొండపాక మండలం దుద్దెడలో పిడుగుపాటుకు తలమైన వెంకటలక్ష్మికి చెందిన మూడు దూడలు మృతి చెందాయి.  భారీ వర్షం మూలంగా మూడు జిల్లాలోని పలు గ్రామాల్లో మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.