పద్మశ్రీ గ్రహీత ఇలా భట్ కన్నుమూత.. మోడీ సంతాపం

పద్మశ్రీ గ్రహీత ఇలా భట్ కన్నుమూత.. మోడీ సంతాపం

స్వయం ఉపాధి మహిళా సంఘం (SEWA) వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఇలా భట్ (89) కన్నుమూశారు. "మహిళా కార్మికుల హక్కుల కోసం వాదించడంలో అగ్రగామి అయిన మా ప్రియమైన, గౌరవనీయమైన ఇలా భట్ కన్నుమూశారు. ఆమె మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. ఆమె వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మేం కృషి చేస్తాం" అని SEWA భారత్ ట్వీట్ చేసింది. 

ఇలా భట్ మృతి పట్ల ప్రధాని మోడీ  సంతాపం తెలిపారు. " భట్ మరణ వార్తను వినాల్సి రావడం చాలా బాధాకరం. మహిళా సాధికారత, సామాజిక సేవ, యువతలో విద్య కోసం ఆమె చేసిన కృషి చిరకాలం గుర్తుండిపోతుంది. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని ఆయన గుజరాతీలో ట్వీట్ చేశారు.

1933 సెప్టెంబర్ 7 న గుజరాత్ లో జన్మించిన  ఇలా భట్ న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. 1973లో స్వయం ఉపాధి ఉమెన్స్ అసోసియేషన్ ను స్థాపించారు. 1979లో ఉమెన్స్ వరల్డ్ బ్యాంకింగ్‌ను కూడా స్థాపించారు.  మహిళలకు సాధికారత కల్పించడంలో ఆమె చేసిన కృషికి గానూ భారత ప్రభుత్వం 1985లో  పద్మశ్రీ, 1986లో పద్మభూషణ్‌తో సత్కరించింది. 1956లో ఇలా భట్, రమేష్ భట్‌ని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.