కరోనా టెన్షన్ డ్యూటీలో అటెన్షన్‌‌..సీవరేజీ కార్మికుల అవస్థలు

కరోనా టెన్షన్ డ్యూటీలో అటెన్షన్‌‌..సీవరేజీ కార్మికుల అవస్థలు

హైదరాబాద్, వెలుగు కరోనా ప్రభావం.. లాక్‌‌డౌన్‌‌తో అందరూ ఇండ్లల్లోనే ఉంటున్నారు. సీవరేజీ కార్మికులు  మాత్రం రోడ్లపై పొంగే మురుగు తొలగించి డ్రైనేజీలను క్లీన్‌‌ చేస్తున్నారు. కంటైన్‌‌మెంట్‌‌, రెడ్‌‌ జోన్లలోనూ ఎమర్జెన్సీ డ్యూటీలు చేస్తున్నారు. పక్కనోడు తుమ్మితేనో, ముట్టుకుంటేనో  కరోనా అంటుకుంటుందనే  అనుమానంతో భయపడుతున్న రోజుల్లోనూ విధులు నిర్వహిస్తున్నారు. వాటర్ బోర్డులోని డివిజనల్, ఫిల్లింగ్ స్టేషన్లతో పాటు, సర్కిల్ కార్యాలయాల్లో  లైన్ మెన్లు, సీవరేజీ కార్మికులు విధుల్లో ఉంటున్నారు. సాధారణ రోజుల్లో 8 గంటల డ్యూటీలో జెట్టింగ్, సక్కర్ వంటి మెషీన్లు వాటర్ బోర్డు వినియోగిస్తుంది. అయితే  అవసరాన్ని బట్టి సీవరేజీ గుంతల్లోకి దిగితే కానీ డ్రైనేజీలో ఇరుక్కున్న చెత్త తొలగదు. అదే విధంగా ఇంటింటికి నల్లా నీటిని సరఫరా చేసేందుకు ఇనుపరాడ్లతో గల్లీ గల్లీలో తిరుగుతూ పని చేస్తున్నారు.

పని ఒత్తిడి ఉన్నా.. తీరిక లేకుండా..

హైదరాబాద్ లో అత్యవసర పరిస్థితుల్లోనూ సీవరేజీ, తాగునీటి నిర్వహణలో డ్యూటీలను చేస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. వాటర్ బోర్డు పరిధిలో  సీవరేజీ, వాటర్ సప్లయ్ నిర్వహణకు  మొత్తం 5,500 మంది కార్మికులు ఉన్నారు. ఇందులో 2,300 మంది సీవరేజీ,  మరో 2,500మంది లైన్‌‌మెన్లు ఉండగా లాక్ డౌన్ లోనూ  తీరికలేకుండా విధులు కొనసాగిస్తున్నారు.

రెండు షిప్టుల్లో డ్యూటీ..ఆఫీస్‌‌లోనే లంచ్‌‌

సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి డ్యూటీలకు హాజరవుతున్నారు.  ఆఫీసుకు రాగానే  ముందుగా స్ప్రే చేసిన గ్లౌజులు, కోట్ వేసుకుని ఫిల్లింగ్ స్టేషన్లు, మ్యాన్ హోళ్లపై డిస్‌‌ ఇన్‌‌ఫెక్టివ్‌‌ స్ప్రే చేస్తారు. డ్యూటీ అయిపోగానే   హైపో క్లోరైడ్ కలిపిన నీళ్లతో స్నానం చేస్తారు.  రెండు షిఫ్టుల్లో డ్యూటీలు చేస్తుండగా ఆఫీసులోనే భోజన సదుపాయం కల్పించారు.  వంట కూడా వారే చేసుకుంటున్నారు. ఎవరి ప్లేట్లలో వాళ్లే తినాలన్నా రూల్‌‌  ఉంది. తిన్నాక ఎవరిది వారే కడుకుంటున్నారు.  మరుసటి రోజు లీవ్‌‌ తీసుకునేలా వాటర్ బోర్డు వెసులుబాటు కల్పించింది.

మొదట్లో భయపడ్డా..

కరోనా తొలిరోజుల్లో కంటైన్‌‌మెంట్ జోన్ లో డ్యూటీ అని తెలిసి భయపడ్డా. కానీ ఎమర్జెన్సీ విధుల్లో ఉన్నప్పుడు   ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవాల్సిందే. సీవరేజీ సామగ్రితో వెళ్లి మ్యాన్ హోల్స్‌‌ క్లీన్‌‌ చేస్తున్నాం.

– రమేష్, లైన్‌‌మెన్

కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

సీవరేజీ కార్మికులు, లైన్ మెన్లకు పీపీఈ కిట్లను అందజేశాం. వారి హెల్త్​  గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ  మెడికల్ టెస్ట్ లు చేస్తున్నాం. సీవరేజీ ఓవర్ ఫ్లో, వాటర్ సప్లయ్ తీవ్రంగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం.  కాల్స్ కూడా పెరిగాయి.

–  సురేష్ కుమార్,  సెక్షన్​ మేనేజర్

వారంలో రెండు సార్లు టెస్టులు 

లాక్‌‌డౌన్‌‌తో  పని పెరిగిపోయింది. రోజూ రెండు షిఫ్ట్‌‌ల్లో డ్యూటీ చేస్తున్నాం. మధ్యాహ్నం ఆఫీసులోనే లంచ్ ఏర్పాటు చేశారు. సాధారణ రోజుల్లో డ్యూటీ అయిపోయాక ఇంటికి వెళ్లి తినాల్సి వచ్చేది. వారంలో రెండుసార్లు మెడికల్‌‌ టెస్ట్‌‌లు చేస్తున్నారు.

– లక్ష్మినారాయణ, లైన్‌‌మెన్