దళిత అమ్మాయిపై అత్యాచారం

దళిత అమ్మాయిపై అత్యాచారం
  • స్కూల్​కు వెళ్తుండగా దారుణం 
  • ఇద్దరు యువకుల అరెస్టు.. వనపర్తిలో ఘటన 

పానగల్, వెలుగు: దళిత అమ్మాయిపై రేప్ జరిగింది.  వనపర్తి జిల్లా పానగల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన దళిత అమ్మాయి.. 5 కిలోమీటర్ల దూరంలో ఉండే హైస్కూల్​లో 9వ తరగతి చదువుతోంది. మంగళవారం తన క్లాస్ మేట్, ఆరో తరగతి పిలగానితో కలిసి నడుచుకుంటూ స్కూల్ కు వెళ్తోంది. ఆ టైమ్ లో బోయతుల్జా నాగరాజు(28), బోయ దాసరి అనిల్(27) బైక్​పై వాళ్లను వెంబడించారు. 

వీళ్లిద్దరికీ పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు ముగ్గురినీ స్కూల్​లో డ్రాప్​ చేస్తామని నిందితులు నమ్మించారు. ఈ క్రమంలో అమ్మాయి ఫ్రెండ్, పిలగాన్ని బైక్ పై ఎక్కించుకొని.. స్కూల్ దగ్గర దింపడానికి అనిల్ వెళ్లాడు. ఆ తర్వాత అమ్మాయిని నాగరాజు కంప చెట్లల్లోకి లాక్కెళ్లి రేప్ చేశాడు. ఈలోగా అనిల్ కూడా అక్కడికి వచ్చాడు. అతనూ రేప్ చేయడానికి ప్రయత్నించగా, ఆమె కేకలు వేసింది. దీంతో భయపడి ఇద్దరూ పారిపోయారు. అమ్మాయి అక్కడి నుంచి స్కూల్ కు వెళ్లి జరిగిందంతా టీచర్లకు చెప్పింది. వాళ్లు పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వనపర్తి డీఎస్పీ కిరణ్ కుమార్, పానగల్ ఎస్సై నాగన్న స్పాట్ కు వచ్చి పరిశీలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని జిల్లా ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. కాగా, బాధిత ఫ్యామిలీకి న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మార్పీఎస్, దండోరా, విద్యార్థి సంఘాలు పానగల్ లో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.