హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర క్రీడాశాఖలో మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపుల ఘటన మరొకటి బయటకు వచ్చింది. తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్లో ఓఎస్డీపై లైంగిక వేధింపుల ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపగా.. ఇప్పుడు ఏకంగా క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పేషీ నుంచే ఓ అమ్మాయిని వేధించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పేషీలో పని చేస్తున్న ఉద్యోగి ఓ నేషనల్ లెవెల్ ప్లేయర్‌ను వేధించాడు. సదరు ప్లేయర్‌కు హెల్ప్ చేయాలంటూ ఆమె బంధువు మంత్రి దగ్గరకు తీసుకెళ్లాడు.
ఆ టైమ్‌లో అమ్మాయితో పరిచయం చేసుకున్న ఉద్యోగి ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. సాయం చేయడానికి బదులు ఆమెతో అనుచితంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. నిన్ను పర్సనల్‌గా కలవాలి.. పర్సనల్ ఫొటోలు పంపించు అంటూ మెసేజ్‌లు చేశాడు. ఈ విషయాన్ని తనను మంత్రికి కలిపించిన బంధువు దృష్టికి ఆ ప్లేయర్ తీసుకెళ్లింది. దాంతో, ఆమె బంధువు ఉద్యోగికి ఫోన్ చేసి నిలదీసిన ఆడియో బయటకు వచ్చింది. మంత్రికి చెబుతానని హెచ్చరించడంతో తప్పయిందంటూ ఉద్యోగి కాళ్ల బేరానికి వచ్చాడు. విషయం తెలిసి పేషీ నుంచి అతడిని తొలగించినట్టు తెలుస్తోంది.
విచారణ కమిటీ చేతికి వేధింపుల కాల్ రికార్డులు?
శామీర్‌పేట, వెలుగు: హకీంపేట స్కూల్లో లైంగిక వేధింపుల కేసులో విచారణ కమిటీ రెండో రోజు కీలక ఆధారాలను సేకరించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనను వెలుగులోకి తీసుకొచ్చిన ఓ వ్యక్తి తన వద్ద ఉన్న ఆధారాలు, కాల్ రికార్డులను కమిటీ సభ్యులకు అందించినట్టు సమాచారం. ముందుగా స్కూల్ లో స్టూడెంట్లను ఎంక్వయిరీ చేసి వారి స్టేట్ మెంట్లను రికార్డు చేసింది. మరో రెండురోజులు విచారణ చేసిన తర్వాత కలెక్టర్ కు రిపోర్టు అందజేయనుంది.
మరోవైపు సస్పెన్షన్ కు గురైన అధికారిని కాపాడేందుకు స్పోర్ట్స్ స్కూల్లో ఆయనకు అనుచరులుగా ఉన్న కొందరు ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్కూల్లోని ఓ టీచర్, మహిళా ఉద్యోగి, ఇద్దరు కోచ్‌లు ఓఎస్డీ గురించి కమిటీకి పాజిటివ్‌గా చెప్పాలని అక్కడి స్టాఫ్, స్టూడెంట్లపై ఒత్తిడి తెస్తున్నారని, వీళ్లను స్పోర్ట్స్ స్కూల్ నుంచి తప్పిస్తేనే అసలు నిజాలు బయటకు వస్తాయని క్రీడాకారులు, కోచ్‌లు చెబుతున్నారు.