
అథ్లెటిక్స్‌లో జాతీయ స్థాయి మెడల్ సాధించి ఓ ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూల్లో విధులు నిర్వహిస్తున్న పీఈటీ హాస్టల్ లోని ఇద్దరు మగ పిల్లలను మూడు రోజులుగా లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బాధిత విద్యార్థులను భయపెట్టాడు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు గురువారం స్కూల్‌కు వచ్చి పీఈటీకి దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన యాలాల పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పెద్దేముల్ మండలం ఓమ్లానాయక్ తండాకు చెందిన ఇద్దరు గిరిజన విద్యార్థులు తాండూరు శివారులోని ప్రతిభ రెసిడెన్షియల్ హైస్కూల్లో 7, 8వ తరగతి చదువుతున్నారు. ఇటీవల స్కూల్ లో వార్డెన్ కమ్ పీఈటీగా చేరిన కేస్లావత్ దశరథ్ కొంతకాలంగా ఇద్దరు పిల్లలపై కన్నేశాడు. రాత్రిపూట విద్యార్థులంతా నిద్ర పోగానే దశరథ్వారి వద్దకు వచ్చి వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇలాంటి పనులు తాము చేయలేమంటూ విద్యార్థులు చెప్పినా వినకుండా వారి బట్టలు చింపేసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం తమ తల్లిదండ్రులకు చెబుతామని విద్యార్థులు ఎదురుతిరగడంతో దశరథ్ మరింత రెచ్చిపోయాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. గత్యంతరం లేక విద్యార్థులు తమకు తెలిసిన రమేష్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. గురువారం ఉదయం స్కూల్ కు వచ్చిన గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు విఠల్‌నాయక్, మాజీ కౌన్సెలర్ భీంసింగ్రాథోడ్, విద్యార్థుల కుటుంబ సభ్యులు స్కూల్ ప్రిన్సిపాల్ జాకోబ్ పీటర్‌కు ఫిర్యాదు చేశారు. వార్డెన్ దశరథ్ను పిలిపించడంతో బాధిత కుటుంబీకులు అతడికి దేహశుద్ధి చేశారు. దీంతో స్కూల్ యాజమాన్యం వెంటనే యాలాల పోలీసులకు సమాచారం అందజేశారు. నిందితుడు దశరథ్ను అదుపులోకి తీసుకుని యాలాల స్టేషన్‌కు తరలించారు. సంఘటనపై డీఎస్పీ లక్ష్మీనారాయణ, రూరల్ సీఐ జలంధర్‌రెడ్డి, ఎస్సైలు విఠల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి విచారణ చేపట్టారు. ప్రిన్సిపాల్, యాజమాన్య ప్రతినిధులను, విద్యార్థులను, టీచర్లను, తల్లిదండ్రులను విచారించారు. నిందితుడిపై ఫోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని డీఎస్పీ తెలిపారు. నిందితుడు దశరథ్ శంకర్పల్లి మండలం మోకిల గ్రామానికి చెందిన గిరిజనుడు. కాలేజీ చదివే రోజుల్లో జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో మెడల్ సాధించాడు. దశరథ్ను కఠినంగా శిక్షించాలని యాజమాన్య ప్రతినిధులు చంద్రశేఖర్ పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు.