పెండింగ్ స్కాలర్​షిప్​లను రిలీజ్ చేయాలి

పెండింగ్ స్కాలర్​షిప్​లను రిలీజ్ చేయాలి
  •     హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ఎస్ఎఫ్ఐ నాయకుల ధర్నా

హైదరాబాద్, వెలుగు : పెండింగ్​స్కాలర్​షిప్​లు, ఫీజు రియంబర్స్​మెంట్ ను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. యూనియన్​నాయకులతో కలిసి గురువారం ఉదయం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. ఆరేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం స్టూడెంట్లకు ఫీజులు చెల్లించడం లేదని మండిపడ్డారు. ఏటా రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది స్కాలర్ షిప్​కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని, అందరికీ కలిపి రూ.3వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు.

2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.8,214.57 కోట్లు పెండింగ్​పెట్టిందని వాపోయారు. హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె.అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. అకడమిక్ ఇయర్ ప్రారంభంలోనే విద్యార్థుల నుంచి దరఖాస్తులు తీసుకుని అర్హులను గుర్తించాలని కోరారు. అర్హులకు ముందుగా 25 శాతం ఫీజు రియంబర్స్​మెంట్​చెల్లించాలని డిమాండ్​చేశారు. తర్వాత మిగిలిన మొత్తం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు లెనిన్ గువేరా, జిల్లా నాయకులు సునీల్, చరణ్య, విఘ్నేశ్, అజయ్, భరత్ తదితరులు పాల్గొన్నారు.