- ప్రైవేటు బడుల్లో ఫీజులను నియంత్రించాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ స్కూళ్లలోని ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. గురువారం విద్యారంగంలోని సమస్యల పరిష్కారం కోసం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌ను ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు, నేతలు ముట్టడించారు. ర్యాలీగా వచ్చిన నేతలను పోలీసులు అడ్డుకోవడంతో, అక్కడే భైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో లోపలికి వెళ్లేందుకు గేట్లు దూకేందుకు నేతలు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు.
పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్. రజనీకాంత్, తాళ్ల నాగరాజు మాట్లాడారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు విద్యను వ్యాపారంగా మార్చేశాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో దామెర కిరణ్, కె. అశోక్ రెడ్డి, లెనిన్ గువేరా, ప్రణయ్, కార్తీక్, రమేష్, వెన్నెల, శ్రీకాంత్, లిఖిత్, చరణ్, అరుణ్ పాల్గొన్నారు.
