ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఫైర్

ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఫైర్
  • కార్పొరేట్ స్కూళ్లకు సీఎం మద్దతివ్వడం ఏంది?: ఎస్ఎఫ్​ఐ రాష్ట్ర కమిటీ ఫైర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్  బడుల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు తక్షణమే నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు డిమాండ్  చేశారు.  ప్రభుత్వ విద్యను రక్షించేందుకు సర్కారు అత్యవసర చర్యలు చేపట్టాలని ఆదివారం ఒక ప్రకటనలో వారు కోరారు. ముఖ్యమంత్రి రేవంత్  రెడ్డి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సింది పోయి, ప్రైవేట్  సంస్థలకు బహిరంగంగా మద్దతు తెలపడం ఆందోళనకరమని చెప్పారు.  

ప్రైవేట్  స్కూల్‌‌ను తన బ్రెయిన్ చైల్డ్  అని పేర్కొనడం చూస్తుంటే.. సీఎం కార్పొరేట్  విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌‌గా మారినట్లు కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో వందలాది ప్రభుత్వ స్కూళ్లు మూతపడే స్థితిలో ఉన్నాయని, కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్  చేశారు. నగరాల్లో ప్రైవేట్ విద్యాసంస్థల ఆధిపత్యం పెరిగిపోతోందని, ఫీజుల భారంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు.