
టాలీవుడ్ బ్యూటీ సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’. ఇందులో శకుంతలగా సమంత.. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. ఈ మూవీ ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని ఇప్పటికే మేకర్స్ తెలిపారు. అయితే ఈ సినిమా ఇప్పుడు మరోసారి వాయిదా పడింది. ఈ చిత్రం 17న థియేటర్లకు రావడం లేదనీ, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాను ఒక విజువల్ వండర్ గా తీర్చిదిద్దారనే విషయం ఈ పాటల ద్వారానే అర్థమైపోయింది. ఈ తరహా కథలపై దర్శకుడిగా గుణశేఖర్ కి గల పట్టుకు .. మెలోడీ గీతాలపై మణిశర్మకి గల పట్టుకు ఈ సినిమా ఒక ఉదాహరణగా నిలవడం ఖాయమని అంటున్నారు.
హృదయానికి హత్తుకునే కథతో పాటు భారీ తారాగణం ఈ చిత్రంలో నటించారు. సచిన్ ఖేడేకర్, కబీర్ బేడీ, డా.ఎం.మోహన్ బాబు, ప్రకరాష్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిస్సు సేన్ గుప్తా కీలక పాత్రల్లో నటించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువరాజు భరతుడి పాత్రలో నటించటం ప్రధాన ఆకర్షణ కానుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై నీలిమ గుణ నిర్మాతగా ఈ సినిమా రూపొందుతోంది.