సరైన యుద్ధం : కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ

సరైన యుద్ధం : కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అసలు మజా ఇప్పుడు వచ్చింది. సీఎం కేసీఆర్ రెండు చోట్ల నుంచి బరిలోకి దిగుతున్నారు. ఒకటి గజ్వేల్, మరొకటి కామారెడ్డి. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ స్వయంగా ప్రకటించారు.  కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీకి రెడీ అయ్యారని.. నవంబర్ 10వ తేదీ నామినేషన్ దాఖలు చేయబోతున్నట్లు కూడా వెల్లడించటం సంచలనంగా మారింది. రేవంత్ రెడ్డి కూడా రెండు చోట్ల నుంచి బరిలోకి దిగుతున్నారు. ఒకటి కొడంగల్. ఇప్పటికే ఈ సీటుకు నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు రెండో స్థానం నుంచి పోటీకి రేవంత్ రెడీ కావటం తెలంగాణ రాజకీయాల్లో అసలు సిసలు యుద్ధం అని చెప్పొచ్చు.

నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో   నిర్వహించిన  పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు షబ్బీర్ అలీ. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన..తన కోసం కష్టపడే దాంట్లో రెట్టింపు స్థాయిలో కష్టపడి రేవంత్ రెడ్డిని గెలిపించాలని కోరారు.  భూములను లాక్కునేందుకే కేసీఆర్ కామారెడ్డిలో పోటీచేస్తున్నారని చెప్పారు.  రేవంత్ రెడ్డిని కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిపించి కేసీఆర్ ను తరిమికొట్టాలన్నారు. కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. నవంబర్ 10న రేవంత్ నామినేషన్ వేస్తారని..  అనంతరం రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కామారెడ్డి భారీ బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు

కామారెడ్డి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ  పోటీ చేస్తారని ప్రచారం ఉంది.  అయితే కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కోవాలంటే రేవంత్ రెడ్డే కరెక్ట్ అంటూ పార్టీ కార్యకర్తలు సూచించడంతో కామారెడ్డిలో రేవంత్ పోటీచేస్తారని రెండు మూడు రోజులుగా పార్టీ వర్గాలు హింట్ ఇచ్చాయి. కామారెడ్డి నుంచి ఇంకా అభ్యర్థిని కూడా ప్రకటించలేదు కాంగ్రెస్. షబ్బీర్ అలీ కామెంట్స్ తో కామారెడ్డిలో రేవంత్ పోటీ కన్ఫర్మ్ అని తెలుస్తోంది.