IND vs BAN: 11 ఏళ్ల తరవాత ఓటమి.. అప్పుడు ఇప్పుడు ఆ ఒక్కడే దెబ్బకొట్టాడు

IND vs BAN: 11 ఏళ్ల తరవాత ఓటమి.. అప్పుడు ఇప్పుడు ఆ ఒక్కడే దెబ్బకొట్టాడు

పసికూన జట్టుగా భావించే బంగ్లాదేశ్.. భారత్ జట్టుకు ఎలాంటి షాకిచ్చిందో అందరకి విదితమే. చివరి మ్యాచ్ లో బలమైన భారత జట్టును ఓడించి.. గౌరవప్రదంగా టోర్నీ నుండి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ లో బంగ్లా బ్యాటర్ల పోరాటాన్ని మెచ్చుకోవాల్సిందే. బంగ్లా ఇన్నింగ్స్ సమయంలో 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశ నుండి 265 పరుగులు చేశారంటే.. వారు ఏ స్థాయిలో రాణించారో అర్థం చేసుకోవాలి.

ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలుపుకు, భారత ఓటమికి ముఖ్య కారకుడు ఆ జట్టు కెప్టెన్ షకిబుల్ హసన్. బ్యాటింగ్ లో 80(85 బంతుల్లో; 6 ఫోర్లు, 3 సిక్సులు) పరుగులు చేసిన షకీబ్.. బౌలింగ్ లోనూ రాణించాడు. తన 10 ఓవర్ల కోటాలో రెండు మెయిడిన్లు వేయడమే కాకుండా 43 పరుగులే ఇచ్చాడు. అతడు బ్యాటింగ్ లో పోరాడిన తీరు.. జట్టులోని ఇతర ఆటగాళ్లతో నమ్మకాన్ని నిలిపింది. అదే వారిని విజయం వైపు నడిపించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ రాణించిన షకీబ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. 

Also Read :- చెత్త రికార్డుల్లోనూ గొప్పోడే: భారత తొలి ఆటగాడిగా రోహిత్ చెత్త రికార్డ్

2012లోనూ ఇతడే

2012 ఆసియా కప్ సమయంలోనూ బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓటమిపాలైంది. భారత జట్టు నిర్ధేశించిన 290 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా బ్యాటర్లు నాలుగు బంతులు మిగిలివుండగానే చేధించారు. మొదట భారత బ్యాటర్లలో సచిన్ టెండూల్కర్(114) సెంచరీ చేయగా.. లక్ష్య ఛేదనలో షకిబుల్ హసన్ 31 బంతుల్లో 49 పరుగులు చేసి మ్యాచ్ బంగ్లా వశం చేశాడు. ఆ మ్యాచ్‪లోనూ అతడే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ఇలా రెండు సార్లు భారత్ ఓటమికి షకీబ్ కారకుడయ్యాడు.

కాగా, ఆసియా కప్ 2023 ఫైనల్‌లో భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఆదివారం(సెప్టెంబర్ 17) జరగనుంది.