శని దేవుడు ఎప్పుడు పుట్టాడు.. ఆ రోజు చేయాల్సిన పూజా విధానం ఇదే..!

శని దేవుడు ఎప్పుడు పుట్టాడు.. ఆ రోజు చేయాల్సిన పూజా విధానం ఇదే..!

పండితులు .. జ్యోతిష్య శాస్త్రం తెలిపిన వివరాల ప్రకారం... శని దేవుడి అనుగ్రహం లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇక అర్దాష్టమశని.. ఏలినాటి శని దోషం ఉంటే చాలు.. వారు ఏ వృత్తిలో ఉన్నా.. ఏ పని చేసినా అన్నీ ఆటంకాలే ఎదురవుతాయి.  శని దోషంతో బాధపడే వారు శని జయంతి రోజున ప్రత్యేక పూజలు చేస్తే విముక్తి కలుగుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  శ్రీ విశ్వావశునామ సంవత్సరంలో ( 2025) శని జయంతి ఎప్పుడు.. ఆరోజు  ఎలాంటి పూజలు చేయాలో తెలుసుకుందాం.  .

పురాణాల ప్రకారం శని దేవుడు వైశాఖమాసం అమావాస్య రోజున  ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు, ఛాయా దేవి దంపతులకు  జన్మించాడు. ఆ రోజున ప్రధానంగా శని మహారాజును పూజిస్తారు. ఆయన అనుగ్రహంతో అన్ని రకాల వ్యాధులు, అప్పుల నుంచి ఉపశమనం పొందుతాడు. ఈ రోజున దానధర్మాలు చేయడం ద్వారా.. జీవితంలో ఆనందం,శ్రేయస్సు పెరుగుతాయి.

శనిశ్వరుడి జయంతి  ఎప్పుడంటే..

ఈఏడాది ( 2025)  శనిశ్వర జయంతి జరుపుకునే విషయంలో కొంత గందరగోళం ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలోని అమావాస్య తిధి మే 26న మధ్యాహ్నం 12:11 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మరుసటి రోజు అంటే మే 27న రాత్రి 8:31 గంటలకు ముగుస్తుంది. కనుక శనీశ్వరుడి జన్మదినోత్సవాన్ని మే 27వ తేదీ మంగళవారం జరుపుకోనున్నారు.

శనిదేవుడిని పూజించాలంటే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక సూచనలున్నాయి. అవి పాటించకపోతే..ఆ వ్యక్తి శనిదేవుడి ఆగ్రహానికి గురవుతారు.జ్యోతిష్యం ప్రకారం శని దేవుడికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. జాతకంలో శని వక్రదృష్టి కలిగి ఉన్నట్లయితే వారు పడే బాధలు అన్నీ ఇన్నీ కాదని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు.  పండితులు తెలిపిన వివరాల ప్రకారం శని దేవుడిని న్యాయ దేవుడు, కర్మ ఫలదాత అని కూడా అంటారు.  అందుకే శని దేవుడు పుట్టిన రోజు ప్రత్యేక పూజలు చేయాలి. 

శని జయంతి పూజా విధానం ఏమిటంటే

శనీశ్వరుడి జన్మదినోత్సవం రోజున పూజ చేయడానికి ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. దీని తరువాత శనీశ్వరుడిని నల్లటి వస్త్రంపై ప్రతిష్టించండి. తర్వాత దేవుడి ముందు ఆవ నూనె దీపం వెలిగించండి. పంచగవ్యం, పంచామృతం మొదలైన వాటితో స్నానం చేసిన తర్వాత కుంకుమ పెట్టండి. తరువాత పువ్వులు సమర్పించి, నూనెతో చేసిన స్వీట్లను ప్రసాదంగా సమర్పించండి. తరువాత జపమాల తీసుకుని శని మంత్రాన్ని జపించండి. ఓం ప్రమ్ ప్రీం ప్రౌం సః శనైశ్చరాయ నమః అనే పంచోపచార మంత్రాన్ని జపించడం కూడా శుభప్రదం. దీని తరువాత శని చాలీసా పారాయణం చేసి, శని దేవుడికి హారతి ఇవ్వండి. చివరగా పూజ సమయంలో తెలిసి తెలియక చేసిన తప్పులకు క్షమాపణ అడగండి. శనిశ్వరుడి ఆశీర్వాదం పొందండి. ఆ రోజున శనిశ్వరుడి అనుగ్రహం కోసం నల్ల నువ్వులు, నూనె, నల్లని వస్త్రాలు, ఇనుప వస్తువులు, బూట్లు దానం, మినపప్పు, దుప్పట్లు దానం చేయడం మంచిది. అంతేకాదు పేదవారికి అన్న వితరణ చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. 

 శని ప్రభావాలు చాలా ముఖ్యమైనవి.   ఎందుకంటే ఇది ఒక వ్యక్తి జీవితాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తుంది. అరుదుగా మాత్రమే శని దాని ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.  గత  జన్మలో చేసిన కర్మపై ఈ శని ప్రభావం ఆధారపడి ఉంటుంది. అంటే శని చెడుప్రభావాలు మనుషులు చేసే కర్మలను అనుగుణంగా ఉంటుంది. ఇలాంటి వాటి నుంచి విముక్తి కలిగేందుకు .. జన్మించిన గ్రహం, నక్షత్రం ఆధారంగా శనిదోష నివారణకు పూజలు చేస్తారు. దీని వల్ల  భవిష్యత్తు బాగుంటుందని,  ఎలాంటి సమస్యలకు అనారోగ్యాలకు, దుష్ప్రభవాలకు గురికాకుండా ఉంటారని నమ్ముతుంటారు. అందుకే శని దేవుడికి తప్పకుండా పూజలు చేయాలి.  ఇక శని దేవుడు పుట్టిన రోజున ప్రత్యేకమైన పూజలు చేస్తే  బాధల నుంచి విముక్తి కలుగుతారని పండితులు చెబుతున్నారు.