
- శంకర్ నాయక్ వర్సెస్ మహబూబాబాద్ మున్సిపల్ కౌన్సిలర్స్
- ఎమ్మెల్యే ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారంటూ మంత్రికి ఫిర్యాదు
మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ మున్సిపాలిటీ డెవలప్‌మెంట్ కోసం రిలీజ్ అయిన నిధులు ఎమ్మెల్యే, కౌన్సిలర్ల మధ్య పంచాయితీ పెట్టాయి. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కౌన్సిలర్లు నిరసనలు చేపట్టడమే కాకుండా మంత్రి, కలెక్టర్‌కు వినతిపత్రాలు సైతం అందజేశారు. మహబూబాబాద్ కలెక్టరేట్ బిల్డింగ్ ప్రారంభానికి హాజరైన సీఎం కేసీఆర్ మున్సిపాలిటీ డెవలప్‌మెంట్ కోసం రూ. 50 కోట్ల ఎస్‌డీఎఫ్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. నిధుల మంజూరుకు సంబంధించి ఇటీవల జీవో విడుదల కావడంతో పనుల గుర్తింపు స్టార్ట్ చేశారు.
కొన్ని వార్డులకే ప్రయారిటీ
ఎస్‌డీఎఫ్ నుంచి పట్టణంలోని అన్ని వార్డుల్లో పనులు చేయాల్సి ఉన్నప్పటికీ ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్, మున్సిపల్ చైర్మన్ రాంమోహన్‌రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్, బీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్‌కు వ్యతిరేకంగా మీటింగ్ నిర్వహించడమే కాకుండా నిరసనలు, దీక్షలు సైతం చేపట్టారు. తాజాగా కలెక్టర్ శశాంక, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఎంపీ మాలోతు కవితను వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు సైతం అందజేశారు.
ప్రపోజల్స్ రెడీ ?
రూ.50 కోట్ల నిధులతో చేయాల్సిన పనులకు సంబంధించిన ప్రపోజల్స్, నిధుల కేటాయింపుపై అంతర్గతంగా నిర్ణయాలు జరిగిపోతున్నాయి. పట్టణంలో ఇండోర్ స్టేడియం, కళామందిరం, దివంగత ఎమ్మెల్యే నూకల రామచంద్రారెడ్డి విగ్రహ ఏర్పాటు, బస్టాండ్ – పూసపల్లి సీసీ రోడ్డుతో పాటు ఇతర పనుల కోసం రూ. 32 కోట్ల మేర ప్రపోజల్స్ రెడీ చేసినట్లు సమాచారం. అయితే ప్రపోజల్స్‌పై చర్చించేందుకు రావాలని మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి కౌన్సిలర్లను కోరినా వారు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.