కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తం

కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తం

ప్రస్తుత రాజకీయాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరముందని గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా అన్నారు. కేసీఆర్ కు దేశంలోని తనలాంటి అనేక మంది సీనియర్ రాజకీయ నాయకుల సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. జాతీయ రాజకీయాల్లోకి రావాలని సీఎం కేసీఆర్ ను ఆయన ఆహ్వానించారు. ప్రధాని మోడీ అనుసరిస్తున్న పాలనా విధానాలపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఇటువంటి తరుణంలో మౌనం వహించడం ప్రజాస్వామిక వాదులకు తగదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో గుజరాత్ మాజీ సీఎం శంకర్‌ సింగ్‌ వాఘేలా ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయ పరిణామాలపై దాదాపు ఐదు గంటల పాటు వారిద్దరు చర్చించారు. ఈసందర్భంగా కేసీఆర్ తో వాఘేలా మాట్లాడిన అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘మోడీ ప్రభుత్వంపై పోరాడే సరైన వేదిక దొరకక.. మాలాంటి సీనియర్లను ముందుండి నడిపించే నాయకత్వం లేక కొంత ఆందోళనతో ఉన్నం. ఈ సందర్భంలో చీకట్లో చిరుదీపమై మీరు ప్రతిఘటిస్తున్న తీరు మావంటి సీనియర్ నాయకులను ప్రభావితం చేసింది’’ అని శంకర్ సింగ్ వాఘేలా వ్యాఖ్యానించారు. ‘‘ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఉంటుందనుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోని భావ సారూప్య విపక్షాలను కలుపుకుపోయేందుకు కేసీఆర్ వంటి నాయకత్వం అవసరం ఉంది. మీ నాయకత్వంలో పనిచేయడానికి మేమంతా సిద్ధం. ఇంకా చెప్పాలంటే మిగతా విపక్ష సీనియర్ నాయకులంతా కలిసే నన్ను మీవద్దకు పంపారు. మీరు జాతీయ రాజకీయాల్లోకి వచ్చి దేశ గతిని మార్చాల్సిందిగా కోరుతున్నం’’ అని ఆయన చెప్పారు.

వాఘేలాకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు

వాఘేలా ఆహ్వానానికి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. వాఘేలా వంటి  సీనియర్ జాతీయ నాయకులు తనకు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కాగా,  శంకర్‌ సింగ్‌ వాఘేలా  గుజరాత్ లో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఈ ఏడాది చివరలో గుజరాత్ లో జరగబోయే  అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్ధులను బరిలోకి దింపనున్నట్లుగా వెల్లడించారు.