యాక్టింగ్ వైపు రావాలనుకోలేదు

యాక్టింగ్ వైపు రావాలనుకోలేదు

సినిమా మీద ప్యాషన్​తో అవకాశాల కోసం ఎదురు చూసే తెలుగమ్మాయిలు చాలామందే ఉన్నారు ఇండస్ట్రీలో. అలానే ఈ అమ్మాయి కూడా. పేరు శాన్వి మేఘన.‘‘పుష్పక విమానం’’లో సెకండ్​ లీడ్ రోల్​లో కనిపించింది. చేసే రోల్ చిన్నదా, పెద్దదా అని ఆలోచించలేదు. అవకాశం వస్తే చాలు తన టాలెంట్ నిరూపించుకోవాలనుకుంది. అనుకున్నట్టుగానే డిఫరెంట్ రోల్స్ చేస్తూ తక్కువ టైంలోనే ఆడియెన్స్​కి దగ్గరైంది. కర్లీ హెయిర్​తో, ఎక్స్​ప్రెసివ్​ కళ్లతో, బ్యూటిఫుల్ స్మైల్​తో, తెలంగాణ యాసలో గలగలా మాట్లాడుతూ ఆకట్టుకుంది. డాన్స్​ కూడా చేస్తుంది. అయితే... మొదట్లో యాక్టింగ్ వైపు రావాలనే ఆలోచనే లేదట శాన్వికి! దాంతోపాటు ఇంకా బోలెడు విశేషాలు చెప్పింది.

‘‘పుష్పక విమానం’’ సినిమా ఎక్స్​పీరియెన్స్ ఎలా ఉంది? 

నేను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు నాలుగేండ్లు అయి ఉంటుంది. చిన్న చిన్న రోల్స్ చేసి ఇక్కడిదాకా వచ్చాను. కానీ, ఈ మూవీ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఇది చిన్న జర్నీ కాదు. ఈ మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడే లాక్​ డౌన్ పెట్టారు. దాంతో షూటింగ్ చాలా ఆలస్యం అవుతూ వచ్చింది. షూటింగ్ అయిపోయింది అనుకునేలోపు మళ్లీ సెకండ్ టైం లాక్​ డౌన్​ వచ్చింది. ఆ లాక్​ డౌన్​ తీసేశాక డబ్బింగ్ స్టార్ట్ చేశాం. ఇంత పెద్ద గ్యాప్​ వచ్చేసరికి చాలా ఎగ్జైట్​మెంట్​తో ఎదురుచూశా. ప్రివ్యూ చూసినప్పుడు కూడా చాలా ఎగ్జైట్ అయ్యాను. లాక్ డౌన్​ టైంలో అందరూ స్ట్రెస్​లో ఉన్నారు. ఇలాంటి టైంలో మా సినిమా వస్తే అందరూ హ్యాపీగా ఫీలవుతారు. చాలా నవ్వుకోవచ్చు.. స్ట్రెస్​ నుంచి రిలీఫ్ ఇస్తుందనిపించింది. ఎప్పుడు వస్తుంది? జనాల రియాక్షన్​ చూడాలి అనుకున్నా. అందుకని ఈ సినిమా నాకు చాలా స్పెషల్​.  

లాక్​ డౌన్​లో షూటింగ్​కి గ్యాప్​ వచ్చింది కదా. ఆ టైం ఎలా స్పెండ్ చేశారు?

మేము గాంధీ హాస్పిటల్ దగ్గరలో ఉంటాం. అక్కడ చాలామంది ఫుడ్, వాటర్​ కోసం అడుక్కోవడం కనిపించేది. చాలామంది పేషెంట్స్​ దగ్గర  డబ్బులు ఉండేవి కావు. కొంతమంది తెలిసినవాళ్లు, ఫ్రెండ్స్​ ఫోన్​ చేసి చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేవాళ్లు. ఇదంతా చూసి నాకు ఎలాగైనా మన వంతు సాయం చేయాలనిపించింది. మా ఫ్యామిలీతో కలిసి మా అపార్ట్​మెంట్ కింద ఒక కిచెన్​ పెట్టాం. బీదలకు, వలస వచ్చిన వాళ్లకు దాదాపు 35 రోజులు రెండు పూటలా ఫుడ్ సర్వ్ చేశాం. రోజుకి మూడు నాలుగు వేల మందికి ఫుడ్ అందించాం. కుకింగ్, ప్యాకింగ్ మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్​మే చేశాం. మిడిల్​ క్లాస్​ ఫ్యామిలీస్ కూడా లాక్​ డౌన్​లో చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్లకి గ్రాసరీ ఇచ్చాం. 

లాక్​ డౌన్​లో టైంను ఎలా యూజ్​ చేసుకున్నారు?

లాక్​డౌన్​లో టైం బాగా దొరికింది. మనం ఏం చేస్తున్నాం? మనకి ఏం కావాలి? మనకు నచ్చింది, నచ్చనిది ఏంటి? అని బాగా ఆలోచించేదాన్ని. ఆ టైంలో నేను సినిమాకు సంబంధించిన బుక్స్ చదివాను. మాస్టర్​ క్లాస్​ వీడియోలు​ చూశాను. నటించేవాళ్లకి స్క్రీన్​ రైటింగ్ తెలిసి ఉండటం చాలా ఇంపార్టెంట్​. అందుకని... స్క్రీన్​ రైటింగ్ బుక్స్​ చదివాను. 

బుక్స్​ బాగా చదువుతారా?

అవును. మా ఇంట్లో ఒక చిన్న లైబ్రరీ ఉంది. మా డాడీ అన్ని రకాల బుక్స్ తెస్తుంటారు. నవలలు చదవను. కానీ... థియరీలు, ఫిలాసఫీ, సైకాలజీ, హ్యూమన్​ బిహేవియర్​, ఫిల్మ్​ బుక్స్ చదువుతాను. హీరోయిన్ శ్రీదేవి గురించి రాసిన బుక్​ చదివాను. ఇప్పుడు డైరెక్టర్ మణిరత్నం మీద వచ్చిన బుక్ చదువుతున్నాను. 

యాక్టర్​ కాకపోయుంటే బిజినెస్​ ఉమెన్​అయ్యేవాళ్లా?

అవును. ఇప్పుడైతే యాక్టర్​తో పాటు బిజినెస్​ ఉమెన్​ కూడా అవ్వొచ్చు. ఆ ప్లాన్​ కూడా ఉంది ఫ్యూచర్​లో. 

యాక్టింగ్ కోర్స్​ ఏమైనా చేశారా? 

చిన్నప్పుడు స్కిట్స్ చేశాను. నాటకాల్లో వేసే అవకాశం దొరకలేదు. అది కూడా ఎప్పుడోఒకప్పుడు చేయాలనుంది. కానీ, మొదట్లోనే సినిమా ఆఫర్స్ రావడం వల్ల డైరెక్ట్​గా సినిమాల్లోనే యాక్టింగ్ నేర్చుకునే అవకాశం దొరికింది.

ఆడిషన్​కి వెళ్లేటప్పుడు ప్రిపరేషన్​ ఎలా?

ఆడిషన్​కి వెళ్లేముందు... ఆ క్యారెక్టర్​కి ఎలాంటి డ్రెస్​లో రావాలి? లుక్​ ఎలా ఉండాలి? అని అడుగుతాను. అక్కడికి వెళ్లాక... వాళ్లు ఇచ్చిన స్క్రిప్ట్​ చదివి, అర్థం చేసుకుంటాను. కొన్ని బుక్స్​ చదివినప్పుడు అందులో క్యారెక్టర్​కి కాన్​ఫ్లిక్ట్స్​ ఏమున్నాయి? నేను చేసే సీన్​ ముందు, తర్వాత ఏమవుతుంది? అనే విషయాలతోపాటు క్యారెక్టర్​ మైండ్​లో ఏముంది అనేవి చూసుకుంటాను. 

మొదటి అవకాశం ఎలా వచ్చింది? 

ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. కాలేజ్​లో ఎన్​ఎస్​ఎస్​లో వలంటీర్​గా ఉండేదాన్ని.  మా కాలేజ్​లో ఒక షూటింగ్​ జరుగుతుంటే... అక్కడ నేను వలంటీర్​గా చేశాను. అప్పుడు డైరెక్షన్​ టీం నన్ను చూసి... ‘‘నీకు యాక్టింగ్​ అంటే ఇంట్రెస్టా? ’’అని అడిగారు. ‘‘లేదు.. నేనిక్కడ కల్చరల్ హెడ్. డాన్స్​, కల్చరల్ యాక్టివిటీస్ హోస్ట్ చేస్తాను. డాన్స్​ బాగా చేస్తాను’’ అని చెప్పా. అందుకు వాళ్లు ‘‘యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి’’ అని నా నెంబర్​ తీసుకున్నారు. రెండు నెలల తర్వాత ‘‘సీరియల్​ చేస్తారా’’ అని ఫోన్​ చేసి అడిగారు. ఇంట్రెస్ట్ లేదని చెప్పాం. దాని తర్వాత నటి జయసుధ మా అమ్మకు ఫోన్​ చేశారు. ‘‘మీ అమ్మాయి ఫొటోలు చూశాను. మా టీంకి కూడా నచ్చింది. రేపు ఆడిషన్​కి మా ఇంటికి రండి. అసలు అమ్మాయి చేయగలుగుతుందా? లేదా అనేది చూద్దాం’’ అన్నారు. కానీ... అప్పట్లో నాకు యాక్టింగ్ చేయాలని లేదు. కానీ... అంత పెద్ద నటి ఫోన్​ చేశారు.. కాబట్టి ఒకసారి వెళ్లొద్దామని ఆడిషన్​కి వెళ్లాం. అది నా లైఫ్​లో ఫస్ట్ ఆడిషన్. ఆవిడ చెప్పినట్టు చేశాను. అది ఆమెకి నచ్చింది. సీరియల్ కాకుండా కామెడీ సిరీస్ చేద్దామన్నారు. ‘సరే’ అన్నారు ఇంట్లో వాళ్లు. దానికోసం రిహార్స​ల్స్​ కూడా చేశాం. కొన్ని రీజన్స్​ వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అంతటితో నాకు యాక్టింగ్​లో కెరీర్ లేదు అనుకున్నా. 

ఫస్ట్ ఛాన్స్ మిస్​ అయింది కదా. మరి మళ్లీ ట్రై చేశారా? 

ఫస్ట్ ప్రాజెక్ట్​ అయితే ఆగిపోయింది. కానీ... నాకు ఆఫర్స్​ రావడం మాత్రం ఆగలేదు. నా నెంబర్ డైరెక్షన్​ టీంలలో సర్క్యులేట్ అవ్వడంతో మళ్లీ యాక్టింగ్ ఛాన్స్​లు వచ్చాయి. అలా అనుకోకుండా, నాకు తెలియకుండా, నేనేం చెయ్యాలనేది నేనేం ఆలోచించకుండానే నా దగ్గరికి వచ్చింది. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. ఐ థింక్, చాలామందికి ఇలానే అనుకోనివి జరుగుతుంటాయి లైఫ్​లో. ఫస్ట్ టైం ఆడిషన్​ ఇచ్చాక ‘‘నేను ఇక్కడ ఉండాలి” అనిపించింది. 

డాన్స్​ బాగా చేస్తున్నారు. నేర్చుకున్నారా?

చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకున్నాను. రెండేండ్ల తర్వాత ఆపేశా. ఆ తర్వాత వెస్ట్రన్​ వర్క్​ షాప్స్​కి వెళ్లా. డాన్స్​ ఫస్ట్ లవ్​ నాకు.

ఎలాంటి పాటలకు డాన్స్​ చేయాలనుంది?

మంచి ఎంటర్​టైనింగ్ సినిమాలో, డాన్స్​కి ఎక్కువ స్కోప్​ ఉండే సినిమాలో చేయాలనుంది. ‘రౌడీ బేబీ’, ‘ఫిదా’, ‘లవ్​ స్టోరీ’ సినిమాల్లో సాయి పల్లవి చేసినలాంటి సాంగ్స్​ చేయాలనుంది.

ఇండస్ట్రీలోకి వచ్చింది హీరోయిన్​ అవ్వాలనా? యాక్టింగ్​లో కెరీర్ చూసుకుందామనా?

నాకు ఫస్ట్ ఛాన్స్​ హీరోయిన్​గానే వచ్చింది. ‘‘బిలాల్​పూర్ పోలీస్ స్టేషన్’’​ మూవీలో చేశాను. తర్వాత ‘‘సైరా’’లో చిన్న రోల్ చేశాను. అప్పుడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి ‘‘నువ్వు చిన్న రోల్స్ చేయొద్దు. నెక్స్ట్​​ మూవీ నుంచి హీరోయిన్​గానే చెయ్’’​ అన్నారు. ఆయన అలా ఊరికే చెప్పరు కదా. నాలో ఏదో టాలెంట్ ఉంది అనిపించింది. 

‘‘బిలాల్​పూర్​ పోలీస్ స్టేషన్’’ ఎక్స్​పీరియెన్స్ ఎలా ఉంది?

అది నా ఫస్ట్ మూవీ. అందులో అవకాశం కూడా అలాగే వచ్చింది. అప్పటికి నాకు కెమెరా, లైటింగ్ ఏవీ తెలియవు. సినిమా చేసేటప్పుడు సినిమా ఎలా తీస్తారు? ఎలా యాక్ట్​ చేస్తారు? ఇలా బేసిక్స్​ అన్నీ నేర్చుకున్నా. మంచి వర్కింగ్ ఎక్స్​పీరియెన్స్​ అది​.

మొదటిసారి కెమెరా ముందు నిలుచున్నప్పుడు ఎలా అనిపించింది?

లేదు. చాలా ఎగ్జైట్ అయ్యాను. స్టేజ్​ ఫియర్ లేదు. కల్చరల్ హెడ్​గా చేశాను కాబట్టి. కాలేజీలో నాకు డాన్స్ గ్రూప్ ఉంది. చాలా పర్ఫార్మెన్స్​లు ఇచ్చా. హోస్టింగ్​ కూడా చేశా. అందుకని నెర్వస్​గా అనిపించలేదు. ఎగ్జైట్​మెంట్ మాత్రం ఉంది. 

‘‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్” మూవీలో మీ రోల్ గురించి..

‘‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్” సినిమా డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్​. నా మాట తీరు, యాక్టింగ్ చూసి... నా క్యారెక్టర్​లో మార్పులు చేశారాయన. ఫస్ట్ ఆయన రాసుకున్నది చిన్న రోల్. కానీ.. తర్వాత ఆ క్యారెక్టర్​కి తెలంగాణ యాస పెట్టి, కొన్ని డైలాగ్స్​ యాడ్ చేసి.. రోల్ నిడివి పెంచారు. అది నాకు చాలా మంచి ఎక్స్​పీరియెన్స్​. 
 
ఫేవరెట్ హీరో అల్లు అర్జున్​ని కలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి?

‘‘గంగోత్రి’’ నుంచి ఇప్పటి వరకు అన్ని సినిమాలు ఇష్టం. చాలా సార్లు ఆయన్ను కలిసే ఛాన్స్​ వచ్చింది. కానీ... నాకెప్పుడూ అలా కలవాలనిపించలేదు. ఆయన్ని కలవడానికి ఒక బెటర్ ఛాన్స్ దొరుకుతుంది అనిపించింది. ఈ సినిమా అయ్యాక, ‘‘పుష్పక విమానం’’ హీరో ఆనంద్ ఫోన్ చేసి ‘‘మన సినిమా ట్రైలర్ ఎవరు లాంచ్ చేస్తున్నారో తెలుసా? అల్లు అర్జున్​’’ అనేసరికి ఇన్నాళ్లు ఆయన్ను నేనెందుకు కలవలేదో అర్థమైంది. ఆరోజు నేను ఇచ్చిన స్పీచ్​ కూడా ముందు ప్రిపేర్​ అయింది కాదు. ఆయన పక్కన కూర్చునేసరికి నేను ప్రిపేర్​ అయిందంతా ఎగిరిపోయింది. అక్కడ చెప్పిందంతా అప్పటికప్పుడే చెప్పా. 

ప్రొడ్యూసర్​ విజయ్​ దేవరకొండ గురించి..

చాలా మంచి వ్యక్తి విజయ్​. తను ప్రొడక్షన్​ స్టార్ట్ చేసి కొత్త వాళ్లని ఎంకరేజ్​ చేయడం చాలా నచ్చింది. టీం మొత్తం కొత్తవాళ్లే.. అయినా మా మీద నమ్మకం పెట్టి ఈ సినిమా తీశాడు. నిజంగా గ్రేట్.

ఇకముందు ఎలాంటి మూవీస్​ చేయాలని అనుకుంటున్నారు​?

ఎమోషనల్ లవ్​ స్టోరీ చేయాలనుంది. ‘‘ఫిదా’’ లాంటి సినిమా. ‘‘సారంగ దరియా’’ లాంటి సాంగ్ చేయాలి. 

హాబీలు ఏంటి?

డాన్స్​ చేస్తాను. అదొక్కటే కాదు అప్పుడప్పుడు పెయింటింగ్ వేస్తాను. నేనేం చేసినా క్రియేటివ్​గా చేస్తుంటా.  పియానో కూడా ప్లే చేస్తాను. కాలీగ్రఫీ నేర్చుకున్నా. మొత్తం16 స్టైల్స్​లో కాలీగ్రఫీ చేస్తాను. పుట్టింది, పెరిగింది హైదరాబాద్​లోనే. మా గ్రాండ్ పేరెంట్స్ నుంచి ఇక్కడే సెటిల్ అయ్యారు. నేను తెలుగు అమ్మాయిని. తెలుగు బాగా మాట్లాడతాను. తెలంగాణ యాసలో మాట్లాడటానికి చాలా ప్రాక్టీస్ చేశాను. చదువుకునేటప్పుడు డబ్బింగ్ కోర్స్ చేశాను. అందులో ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి స్లాంగ్స్ నేర్పించారు. నాకు డిఫరెంట్ శ్లాంగ్స్ నేర్చుకోవాలని ఆశ. తెలుగులో ఏ ప్రాంతానికి సంబంధించిన రోల్​ ఇచ్చినా చేస్తాను. డిఫరెంట్​గా చేయడం చాలా ఇష్టం.

ఫ్యామిలీ బ్యాక్​ గ్రౌండ్

నాన్న వంశీ కిశోర్, అమ్మ పద్మ. అన్నయ్య పేరు వంశీ పూజిత్. నాన్న బిజినెస్​ మ్యాన్, అమ్మ హౌజ్​ వైఫ్. అన్నయ్య ఎం.బి.ఎ చేశాడు. స్ర్కిప్ట్స్​ రాస్తుంటాడు. సినిమాకి పెద్ద ఫ్యాన్. ఇప్పుడు షార్ట్​ ఫిల్మ్స్​ డైరెక్షన్​, యాక్టింగ్ రెండూ చేస్తున్నాడు. ఒక ఫీచర్​ ఫిల్మ్​తో లాంచ్​ అవబోతున్నాడు. 

ఏం చదివారు?

సెయింట్ ఫ్రాన్సిస్​లో బికాం చేశాను. బికాం తర్వాత ఎం.బి.ఏ చేద్దామనుకున్నా. ఆ టైంలోనే సినిమా కెరీర్ స్టార్ట్ అవడంతో కుదరలేదు. ఇప్పటికీ నాకైతే ఎం.బి.ఏ చేయాలనుంది. డిస్టెన్స్​లో తప్పకుండా చేస్తా. నాకు కామర్స్ అంటే చాలా ఇష్టం. బిజినెస్​ అంటే ఇంట్రెస్ట్ ఉంది.

మనీష పరిమి