రామ మందిరాన్ని అప్పుడే సందర్శిస్తా : ప్రాణ ప్రతిష్టకు శరద్ పవార్ కు ఆహ్వానం

రామ మందిరాన్ని అప్పుడే సందర్శిస్తా : ప్రాణ ప్రతిష్టకు శరద్ పవార్ కు ఆహ్వానం

జనవరి 22న అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌కు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానంపై ఎన్‌సీపీ అధిష్టానం స్పందిస్తూ ఆయన ప్రతిష్టాపన కార్యక్రమానికి రారని స్పష్టం చేసింది. జనవరి 22 తర్వాత దర్శనానికి వస్తారని పేర్కొంది. ఈ మేరకు శరద్ పవార్ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కు లేఖ రాశారు. నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత తాను ఆలయాన్ని సందర్శిస్తానని చెప్పారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం పూర్తయ్యాక స్వేచ్ఛగా సమయం వెచ్చించి దర్శనానికి వస్తానని, అప్పటికి రామమందిర నిర్మాణ పనులు కూడా పూర్తవుతాయని ఎన్సీపీ అధినేత లేఖ రాశారు.

ప్రతిష్ఠాపనకు హాజరుకామన్న నలుగురు శంకరాచార్యులు

నిర్మాణం అసంపూర్తిగా ఉన్నందున.. శాస్త్రాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హిందూ సమాజానికి చెందిన మత పెద్దలు ఇటీవలే ప్రకటన చేశారు. పూరీ గోవర్ధన్ మఠం మఠాధిపతి.. ఆ తర్వాత ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్ మఠానికి చెందిన 46వ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి సహా నలుగురు శంకరాచార్యులు ఈ కార్యక్రమానికి హాజరు కామని ప్రకటించారు.