ఏడుపాయలలో ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

ఏడుపాయలలో ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
  • ఏడుపాయలలో బాల త్రిపుర సుందరీగా దుర్గమ్మ
  • పల్లకీ సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్​రావు

పాపన్నపేట, వెలుగు: ఏడుపాయలలో సోమవారం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా రాజగోపురంలో ఉత్సవ విగ్రహనికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఊరేగింపును ప్రారంభించారు. ఎమ్మెల్యే రోహిత్ రావు ముఖ్య అతిథిగా హాజరై వన దుర్గా భవానీ మాతకు పూజలు నిర్వహించి, అమ్మవారి  పల్లకి  ఊరేగింపులో పాల్గొన్నారు. 

అనంతరం గోకుల్ షెడ్ లో ఏర్పాటు చేసిన మండపంలో ప్రతిష్ఠించిన దుర్గామాతకు పూజలు చేశారు. కార్యక్రమంలో  పార్టీ అధ్యక్షుడు గోవింద్​నాయక్​, నాయకులు ప్రశాంత్​రెడ్డి, శ్రీకాంతప్ప, మల్లప్ప, శ్రీనివాస్, నరేందర్​గౌడ్, ​రాము పాల్గొన్నారు. 

చాముండేశ్వరి అమ్మవారికి మహాభిషేకం

చిలప్ చెడ్: నవరాత్రుల సందర్భంగా చిలప్ చెడ్ మండలం చిట్కుల్ శివారులో మంజీరా నది తీరాన కొలువైన చాముండేశ్వరి అమ్మవారికి ఇవాళ మహాభిషేకం నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకుడు ప్రభాకర్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి గణపతి పూజ, అఖండ దీపారాధన, స్వస్తివచనం, కలశ స్థాపన పూజలు నిర్వహించారు.

 ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి, హైదరాబాద్, కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారి సుబ్రహ్మణ్యశర్మ, మోతీలాల్ శర్మ, ఆలయ సభ్యుడు శోభన్ బాబు పాల్గొన్నారు.

విద్యాధరికి శరన్నవరాత్రి శోభ 

గజ్వేల్/వర్గల్: దేవి శరన్నవరాత్రుల్లో జగన్మాత ప్రతిరూపాలైన సరస్వతి, దుర్గాదేవి, లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో  పూజిస్తే ఆధ్యాత్మిక జ్ఞానం సిద్ధిస్తుందని అనంతగిరిపల్లి (నాచారం), శ్రీ క్షేత్రం పీఠాధిపతి మధుసూదనానంద సరస్వతి  పేర్కొన్నారు. వర్గల్  విద్యాధరి క్షేత్రంలో నవరాత్రి మహోత్సవ అంకురార్పణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భక్తులనుద్దేశించి మాట్లాడారు. బాల త్రిపుర సుందరీ దేవి అవతారంలో  విద్యాధరి అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించగా స్వామీజీ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఆశీస్సులు అందజేశారు. 

క్షేత్ర వ్యవస్థాపకుడు యాయవరం చంద్రశేఖర శర్మ  ఆధ్యాత్మిక ప్రయాణంలో గొప్ప పనులకు శ్రీకారం చుట్టగా ప్రస్తుతం ఆ పరిమళాలు ప్రతి ఒక్కరిలో దైవచింతన  పెంపొందిస్తున్నట్లు చెప్పారు. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించమని సరస్వతీ మాత, శాంతి, శ్రేయస్సు కోసం లక్ష్మీ దేవిని ప్రార్థించాలని అడ్డంకులు తొలగడానికి  దుర్గామాతను సేవించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా క్షేత్రానికి తరలివచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహా ప్రసాదం అందజేశారు.

రామచంద్రాపురం: రామచంద్రాపురు మండల పరిధిలో దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తుల కోలాహలం మధ్య విగ్రహ ప్రతిష్ఠాపన, ప్రత్యేక పూజలు కొనసాగాయి. ఆర్సీపురం పరిధిలోని మల్లికార్జున నగర్​ కాలనీలో దుర్గా భవాణి యూత్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో 19వ దేవి నవరాత్రులు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సారి 11 రోజులు పాటు శరన్నవరాత్రులు నిర్వహిస్తున్నామని, ప్రతి రోజు ఉదయం, సాయంత్రం కుంకుమ పూజ జరుపుతున్నామని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. 

కలశ యాత్ర

జిన్నారం: బొల్లారం మున్సిపల్ పరిధిలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే కలశ యాత్రను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ చంద్రారెడ్డి ప్రారంభించారు. ఉత్తరాదికి చెందిన మహిళలు కలశాలను తలపై ధరించి మున్సిపల్ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం స్థానిక దుర్గామాత ఆలయంలో అమ్మవారిని పవిత్ర జలాలతో అభిషేకం చేశారు.