అలంపూర్/ కాశీబుగ్గ, వెలుగు: ఐదో శక్తిపీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం జోగులాంబ అమ్మవారు బ్రహ్మచారిణి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, సినీ హీరో శ్రీవిష్ణు ఆలయాలను సందర్శించి స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.
దీక్షితుల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అన్నమాచార్య సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. త్రిశతి అర్చనలో భాగంగా కర్నూలుకు చెందిన స్వర్ణగౌరి గ్రూప్‌నకు చెందిన 150 మంది మహిళలు అమ్మవారికి మంగళ్యాలు సమర్పించారు. వరంగల్ భద్రకాళి దేవస్థానంలోనూ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు అమ్మవారిని అన్నపూర్ణేశ్వరి రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మకర వాహన సేవ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవపై అమ్మవారిని ఊరేగించారు. ఈ కార్యక్రమాల్లో అర్చకులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
