ఉద్యోగాల్లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నరు: షర్మిల 

ఉద్యోగాల్లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నరు: షర్మిల 

హుజూరాబాద్,​ వెలుగు: యువతకు ఉపాధి కల్పిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్.. తన కుటుంబానికే ఉపాధి కల్పించుకున్నారని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల విమర్శించారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి, అదీ ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఉద్యోగాల్లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్.. బతుకే లేని తెలంగాణగా మార్చారని ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, మొదటి సంతకం దానిపైనే చేస్తానని హామీ ఇచ్చారు. గురువారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో షర్మిల పాదయాత్ర చేశారు. మండల కేంద్రంలో ప్రజలతో మాట ముచ్చట నిర్వహించారు. నమ్మి అధికారమిస్తే రాష్ట్ర సంపదనంతా కేసీఆర్ దోచుకుంటున్నారని, ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. 

రైతు సంక్షేమం పట్టని కేసీఆర్.. 

కౌలు రైతు రైతే కాదని కేసీఆర్ అంటున్నారని, ఆయనకు రైతుల సంక్షేమం పట్టదని షర్మిల మండిపడ్డారు. ‘‘రైతుల కోసం మస్తు చేస్తున్నామని చెబుతున్నారు. రైతుబంధుకు రూ.5 వేలిచ్చి వ్యవసాయం పండుగ అయిందని అంటున్నారు. రూ.40 వేలు వచ్చే సబ్సిడీ పథకాలు బంద్ పెట్టి, రూ.5 వేలిస్తే రైతులు కోటీశ్వరులు అవుతారా?” అని ప్రశ్నించారు. కేజీ టు పీజీ, డబుల్​బెడ్రూమ్​ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఉచిత ఎరువులు.. ఇలా ఎన్నో హామీలు ఇచ్చారని, అవన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. ‘‘ఇంట్లో పెద్ద కొడుకులా ఉంటానని కేసీఆర్ చెప్పారు. కానీ కొర్రీలు పెట్టి ఆసరా అందకుండా చేస్తున్నారు. ఇలాంటి కొడుకు ఏ ఇంట్లో ఉండొద్దని జనం అనుకుంటున్నారు” అని విమర్శించారు.