
- కేసీఆర్ను గద్దె దించుతా
- ఆదివాసీలపై సీఎం సవతి తల్లి ప్రేమ
- వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల
- సమ్మక్క సారక్కలకు నిలువెత్తు బంగారం
ఏటూరునాగారం, వెలుగు: మేడారం వన దేవతలను వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల గురువారం దర్శించుకున్నారు. సమ్మక్క సారలమ్మలకు మొక్కులు తీర్చుకోవడానికి కుటుంబ సమేతంగా వచ్చిన షర్మిలకు ఆలయ పూజారులు కొమ్ము, డోలు వాయిద్యాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత అమ్మవార్లకు తన నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఆదివాసీలపై కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారన్నారు. ఆదివాసీలకు పోడు భూములకు పట్టాలిస్తానని ఇవ్వకుండా, ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుంగా మోసం చేస్తున్నాడన్నారు. తరతరాలుగా పోడు చేసుకుంటున్న ఆదివాసీలను జైల్లో పెడుతున్నారన్నారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 3.20 లక్షల ఎకరాలకు ఆర్ఓఎఫ్ఆర్పట్టాలిచ్చారని, తరువాత వచ్చిన ఏ సీఎం కూడా ఒక్క ఎకరాకు పట్టా ఇవ్వలేదన్నారు. తాను తన తండ్రి బాటలో పయనిస్తానని, ఆదివాసీల హక్కుల సాధనకు సమ్మక్క సారలమ్మల స్పూర్తితో పోరాడి కేసీఆర్ను గద్దె దించుతానన్నారు. తర్వాత ఆదివాసీ మ్యూజియాన్ని సందర్శించారు. ఆమె వెంట వైఎస్సార్ టీపీ ములుగు జిల్లా అధ్యక్షుడు రామసహాయం శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ లీడర్లు బాజారు శ్యాంప్రసాద్, తాడ్వాయి మండల అధ్యక్షుడు నర్సింహులు, లీడర్లు వల్స శ్రీనివాస్, ఎర్రబెల్లి మధూకర్ రెడ్డి పాల్గొన్నారు.