వరుస పరాజయాల తర్వాత ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో తిరిగి సక్సెస్ బాట పట్టారు శర్వానంద్. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా శర్వానంద్ సినిమా గురించి ఇలా ముచ్చటించాడు.
‘‘కథ విన్నరోజు నుంచి ఈ చిత్రంపై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. అందుకే ఎప్పుడొచ్చినా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పా. అనుకున్న ఫలితం రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. సంక్రాంతి సీజన్ పోటీతో థియేటర్స్ కొంత తగ్గినా ఇప్పుడు పెరుగుతున్నాయి. చాలా మంచి లాంగ్ రన్ ఉంటుంది. సినిమాలో అన్ని పాత్రలతో పాటు సిచ్యువేషన్ కామెడీ అద్భుతంగా కుదిరింది. నాకైతే ఇంత క్లీన్ కామెడీ సినిమా తీసిన రామ్ అబ్బరాజు ఓ దేవుడిలా కనిపించాడు (నవ్వుతూ). ఇలాంటి దర్శకులు ఇంకా రావాలి.
నిర్మాత అనిల్ ఓ బిగ్ బ్రదర్‌లా సపోర్ట్ చేశారు. ఇక ప్రతి సినిమా కొత్తగా చేయాలనే తపనతో ఒక జానర్‌కు పరిమితం కావాలనుకోలేదు. అయితే అమ్మ చెప్పింది, అందరి బంధువయా, శతమానం భవతి లాంటి చిత్రాలు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గర చేయడం బ్లెస్సింగ్‌గా భావిస్తున్నా. ఈ సంక్రాంతికి కూడా చాలా చోట్ల శ్రీకారం, శతమానం భవతి సినిమాల్లోని పండగ పాటలు వినిపించడం సంతోషంగా ఉంది. ‘జాను’ సినిమా సమయంలో జరిగిన మేజర్ యాక్సిడెంట్‌తో బరువు పెరిగాను.
అందుకే శ్రీకారం, ఆడవాళ్లకు జోహార్లు చిత్రాల్లో లావుగా కనిపించా. ఆ లుక్ నాకే నచ్చలేదు. మనకు మనం నచ్చేలా ఉండాలనే సంకల్పంతో వాకింగ్, రన్నింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్, యోగా లాంటి ఒక్కొక్క దానిపై ఫోకస్ పెడుతూ బరువు తగ్గాను. అదీకాక ‘బైకర్’లోని ఫాదర్ క్యారెక్టర్ కోసం చాలా కష్టపడ్డా. అవన్నీ కూడా ఈ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌కు హెల్ప్ అయ్యాయి. మూవీ షూటింగ్ కూడా పూర్తయింది. దేశం మొత్తం గర్వపడే సినిమా అవుతుంది. ఇదీ తెలుగు సినిమా అని కాలర్ ఎగరేసుకొనేలా ఉంటుంది.
సంపత్ నంది గారితో ‘భోగి’ సినిమా షూటింగ్ జరుగుతోంది. చాలా మంచి కథ. వచ్చే ఏడాది సంక్రాంతికి శ్రీను వైట్ల గారి సినిమాతో వస్తా. ఆయన మార్క్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది’’ అని చెప్పారు.
