అంతరిక్షం టూర్ సక్సెస్

అంతరిక్షం టూర్ సక్సెస్

ఫ్లైట్​ జర్నీలా సాగిన రోదసీ ప్రయాణం
కమర్షియల్​ స్పేస్​ టూర్లకు ముందడుగు
రోదసీలోకి వెళ్లొచ్చిన శిరీష బండ్ల సహా ఆరుగురు
అంతరిక్ష యాత్ర చేసిన తొలి తెలుగు అమ్మాయి

హూస్టన్:  వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ చేపట్టిన ‘యూనిటీ 22’ స్పేస్ టూర్ సక్సెస్ అయింది. ఆదివారం అమెరికా న్యూమెక్సికో స్టేట్ లోని స్పేస్ పోర్ట్ నుంచి ఆ కంపెనీ అధినేత రిచర్డ్ బ్రాన్సన్, తెలుగు అమ్మాయి శిరీష బండ్లతో సహా ఆరుగురు అంతరిక్షంలోకి వెళ్లి విజయవంతంగా తిరిగొచ్చారు. స్పేస్ లోకి వెళ్లిన తొలి తెలుగు అమ్మాయిగా, మూడో ఇండియన్ ఆరిజిన్ మహిళగా శిరీష రికార్డ్ సృష్టించింది. ఈ ప్రయోగంతో కమర్షియల్ స్పేస్ టూర్ లు ప్రారంభించే దిశగా వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ మరో ముందడుగు వేసింది. మరో రెండు ప్రయోగాలు చేస్తే చాలు.. కమర్షియల్ స్పేస్ టూర్ లు మొదలుపెట్టేంతగా ఆ కంపెనీ చేరువైంది.  

అమెరికా న్యూమెక్సికో స్టేట్ లోని ‘స్పేస్ పోర్ట్ అమెరికా’ నుంచి ఆదివారం రాత్రి 8.10 గంటలకు స్పేస్ టూర్ ప్రారంభమైంది. ‘వీఎస్ఎస్ యూనిటీ’ స్పేస్ ప్లేన్ లోకి శిరీష సహా ఆరుగురు ఎక్కారు. వెంటనే స్పేస్ ప్లేన్ ను తీసుకుని ‘వీఎంఈ ఈవ్’ మదర్ ప్లేన్ నింగికి ఎగిరింది. వాతావరణం బాగాలేకపోవడంతో అనుకున్న టైం కంటే 90 నిమిషాలు లేట్ గా టూర్ స్టార్ట్ అయింది. న్యూ మెక్సికో ఎడారి మీద 13 కిలోమీటర్ల ఎత్తుకు చేరిన తర్వాత స్పేస్ ప్లేన్ ను మదర్ ప్లేన్ విడిచిపెట్టింది. ఆ తర్వాత స్పేస్ ప్లేన్ రాకెట్ ఇంజన్ స్టార్ట్ అయింది. క్రమంగా గంటకు 3700 కిలోమీటర్ల స్పీడ్ తో ప్లేన్ పైకి దూసుకెళ్లింది. దాదాపు 88 కిలోమీటర్ల ఎత్తుకు చేరాక ఇంజన్ ఆఫ్ అయిపోయింది. సరిగ్గా అప్పటి నుంచి నాలుగు నిమిషాల పాటు శిరీష, ఇతరులంతా జీరో గ్రావిటీకి లోనై బరువును కోల్పోయి తేలియాడారు. భూమికి ఒకవైపు వంపును స్పేస్ నుంచి చూసి మురిసిపోయారు. ఫ్లోరిడా యూనివర్సిటీ రూపొందించిన ప్రయోగాన్ని శిరీష ఈ సందర్భంగా నిర్వహించారు. తర్వాత స్పేస్ ప్లేన్ భూమికి తిరిగి పయనమైంది. మామూలు విమానం మాదిరిగానే స్పేస్ పోర్ట్ అమెరికా రన్ వేపై దిగడంతో 90 నిమిషాల టూర్ విజయవంతంగా ముగిసింది. 
నాసాకు సెలక్ట్ కాలే.. 
34 ఏండ్ల శిరీష ఏపీలోని గుంటూరు జిల్లాలో జన్మించారు. నాలుగేండ్ల వయసులోనే ఆమె తల్లిదండ్రులతో పాటు అమెరికాలోని హూస్టన్​లో సెటిలయ్యారు. పుర్దూ యూనివర్సిటీలో ఏరోనాటిక్స్, ఆస్ట్రోనాటిక్స్ స్కూల్ లో డిగ్రీ చదివారు. నాసా ఆస్ట్రోనాట్ కావాలనుకున్నారు. కానీ కంటిచూపు (సైట్) కారణంగా సెలక్ట్ కాలేకపోయారు. కానీ ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ స్పేస్ టూర్ లో పాల్గొని, స్పేస్ అంచులదాకా వెళ్లి ఆస్ట్రోనాట్ ల కేటగిరీలో చేరిపోయారు. 
80 కి.మీ. పైకి పోతే ఆస్ట్రోనాట్ 
భూమి నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతాన్ని కర్మాన్ లైన్ అంటారు. స్పేస్ ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని అంచనా. అయితే 80 కిలోమీటర్ల నుంచే జీరో గ్రావిటీ పరిస్థితులు స్టార్ట్ అవుతాయని, అందుకే 80 కిలోమీటర్లు దాటిపోయొచ్చిన వాళ్లందరినీ ఆస్ట్రోనాట్లుగా పరిగణించాలని నాసా చెప్తోంది.  
స్పేస్ టూర్ టికెట్ రూ. 1.86 కోట్లు 
ఇప్పటికి 22 సార్లు స్పేస్ ప్లేన్ తో వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ ప్రయోగాలు చేసింది. ఆస్ట్రోనాట్లతో సహా ప్రయోగం చేయడం ఇది నాలుగోసారి. మరో రెండు ప్రయోగాలు చేశాక, పూర్తిస్థాయిలో కమర్షియల్ టూర్లను స్టార్ట్ చేయనుంది. ఇప్పటికే ఈ కంపెనీ స్పేస్ ప్లేన్ ద్వారా అంతరిక్షానికి టూర్ పోయేందుకు 600 మంది అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారట. ప్రస్తుతం ఒక్కో టికెట్ ధర 2.50 లక్షల డాలర్లు (రూ.1.86 కోట్లు)గా నిర్ణయించారు. రాబోయే రోజుల్లో టికెట్ ధర భారీగా తగ్గించనున్నారు. 
20న జెఫ్ బెజోస్ కూడా.. 
అమెజాన్ మాజీ సీఈవో, బ్లూ ఆరిజిన్ స్పేస్ కంపెనీ అధినేత జెఫ్​బెజోస్ కూడా కమర్షియల్ స్పేస్ టూర్​లకు ప్రయోగాలు చేస్తున్నారు. ఆయన కూడా ఈ నెల 20న సొంత స్పేస్ ప్లేన్ లో అంతరిక్షానికి పోయి రానున్నారు. 
టూర్ కు పోయొచ్చింది వీళ్లే.. 
పైలట్: డేవిడ్ మెక్ కే (స్పేస్ కు వెళ్లడం మూడోసారి) 
కోపైలట్: మైకేల్ మసూకీ (స్పేస్ కు వెళ్లడం రెండోసారి) 
ప్యాసింజర్ (రీసెర్చర్ ఎక్స్ పీరియెన్స్): రిచర్డ్ బ్రాన్సన్ 
ప్యాసింజర్ (రీసెర్చర్ ఎక్స్ పీరియెన్స్): శిరీష బండ్ల 
ప్యాసింజర్ (రీసెర్చర్ ఎక్స్ పీరియెన్స్): కొలిన్ బెనెట్
ప్యాసింజర్ (రీసెర్చర్ ఎక్స్ పీరియెన్స్): బెత్ మోసెస్