- జీఎంపీఎస్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: మొంథా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన గొర్రెల కాపర్లను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని గొర్రెలు, మేకల పెంపకం దార్ల సంఘం (జీఎంపీఎస్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. చనిపోయిన పశువులకు నష్టపరిహారం, అనారోగ్యం పాలైన జీవాలకు వైద్య సేవలు అందించాలని కోరింది. శుక్రవారం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్ మీడియాతో మాట్లాడారు. మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురువడంతో రైతులు పంటలు నష్టపోవడంతో పాటు గొర్రెలు, మేకల పెంపకందార్లపై తీవ్ర ప్రభావం పడిందని పేర్కొన్నారు.
‘‘వందలాది పశువులు అనారోగ్యం బారిన పడి, పెంపకందార్లకు లక్షలాది రూపాయలు ఆర్థికంగా నష్టం వాటిల్లింది. ఫలితంగా అనేక కుటుంబాలు వీధిన పడ్డాయి’’ అని రవిందర్ వివరించారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పశువులు భారీగా నష్టపోయినట్టు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో పశుసంవర్ధక శాఖ అధికారులు సర్వేలు చేస్తున్నప్పటికీ, అవి తూతూ మంత్రంగా ఉన్నాయని రవిందర్ విమర్శించారు. చనిపోయిన ప్రతి గొర్రెకు, మేకకు కనీసం రూ.10వేల నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
