
గొర్రెల ఫామ్స్ నిర్వహణపై
రాష్ట్ర సదస్సులో సూచనలు
హైదరాబాద్, వెలుగు: సాంప్రదాయ పద్ధతిలో గొర్రెల పెంపకానికి ఆధునికత జోడించి మరింత ఉత్పాదకత పెంచవచ్చని రాష్ట్ర స్థాయి సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. ఆధునిక పద్ధతుల్లో గొర్రెల పెంపకాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం(జీఎంపీఎస్) ఆధ్వర్యంలో “ఆధునిక పద్ధతిలో గొర్రెల ఫామ్స్ నిర్వహణ”పై సదస్సు జరిగింది. జీఎంపీఎస్ ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ అధ్యక్షతన జరిగిన సదస్సుకు సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ బీనవేణి రామయ్య షెపర్డ్, శాస్తవేత్త కర్రె మల్లేశ్, వెటర్నరీ డాక్టర్ల సంఘం ప్రతినిధి డాక్టర్ బాబు, గొర్రెల పెంపకం దార్ల సంఘం గౌరవ అధ్యక్షుడు కిల్లె గోపాల్, రాష్ట్ర అధ్యక్షుడు రావుల జంగయ్య, రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. అత్యాధునిక పద్ధతిలో గొర్రెల ఫామ్స్, ఉన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వీలుందని.. గొల్లకురుమలు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పెద్ద ఎత్తున చేపట్టినా ఇప్పటికీ రాష్ట్రంలో రోజుకు 6 వేల గొర్రెలు దిగుమతి అవుతున్నాయన్నారు.గొర్రెల పెంపకంలోకి ఇతరులు రాలేరని, ఒక వేళ వచ్చినా ఇది వారికి సాధ్యమయ్యే పని కాదన్నారు. ఈ నేపథ్యంలో గొల్లకురుమ యువత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని అభివృద్ధి పథంలో సాగాలని సూచించారు. సదస్సులో భాగంగా గొల్లకురుమల చరిత్ర, ప్రభుత్వ పథకాలు, నాయకత్వ లక్షణాలు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. గొర్రెలు, మాంసం ఉత్పత్తులపై వెటర్నరీ డాక్టర్ అశోక్‌కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.