గొర్రెల స్కాం 1,000 కోట్లు! నిర్ధారణకు వచ్చిన ఈడీ

గొర్రెల స్కాం 1,000 కోట్లు!  నిర్ధారణకు వచ్చిన ఈడీ
  • 200పైగా బ్యాంకు ఖాతాల ద్వారా ట్రాన్సాక్షన్స్
  • సోదాల అనంతరం 31మొబైల్ ఫోన్లు సీజ్
  • 20 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్న ఈడీ
  • కాగ్ నివేదిక  ప్రకారం 7 జిల్లాల్లో 253.93 కోట్ల స్కాం
  • 33 జిల్లాల్లో వెయ్యికోట్ల పైమాటేనంటున్న ఈడీ

హైదరాబాద్: రాష్ట్రాన్ని కుదిపేస్తున్న గొర్రెల స్కాంలో రూ. వెయ్యికోట్లకు పైగా గోల్మాల్ జరిగినట్టు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నిర్ధారణకు వచ్చింది. మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ ఇంట్లో సోదాలు చేసి నగదు, విలువైన పత్రాలను స్వాధీనం చేసుకుంది.  

ఈ కేసులో ఆరు చోట్ల ఈడీ అధికాఉలు తనిఖీలు చేశారు.   ప్రధాన నిందితుడు మొయినుద్దీన్‌, పశుసంవర్థక శాఖ మాజీ డైరెక్టర్‌ రామచందర్‌ నాయక్‌, పలువురి ఇళ్లలో అధికారులు తనిఖీలు చేశారు. ప్రధాన నిందితుడు విదేశాల్లో ఉండటంతో అతన్ని రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలుత ఈ కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీని ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. 

గొర్రెల పంపిణీతో రూ.750 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఏసీబీ గుర్తించి కేసు నమోదు చేసింది. ఇందులో మనీ ల్యాండరింగ్ జరిగినట్టు భావించిన ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించింది. కాగ్ నివేదిక ప్రకారం ఏడు జిల్లాల్లో 253.93 కోట్ల రూపాయల మేర పక్కదారి పట్టాయని తేలింది. అయితే 33 జిల్లాల్లో కలిపి వెయ్యి కోట్ల రూపాయల మేర దారిమళ్లాయని ఈడీ నిర్ధారణకు వచ్చింది. 

►ALSO READ | అధికారంలో ఉన్నోళ్లను దించడానికి కమ్యూనిస్టులు పనికొస్తరు : సీఎం రేవంత్ రెడ్డి

 లబ్ధిదారులకు వెళ్లాల్సిన డబ్బును ప్రైవేటు వ్యక్తులు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నట్టు ఈడీ భావిస్తోంది. ఇందుకోసం పలువురు ఉపయోగించుకున్న 200కు పైగా బ్యాంకు ఖాతాలను గుర్తించింది. వారి పాస్ బుక్స్ ను స్వాధీనం చేసుకుంది. డబ్బులు ఎలా జమ అయ్యాయి. ఎవరెవరికి వెళ్లాయి..? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.  

ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లకు ఉపయోగించిన 31 మొబైల్ ఫోన్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాల ఓపెనింగ్.. నిర్వహణకు సంబంధించి అక్రమార్కులు వాడిన 20 సిమ్ కార్డులను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ ఇంట్లోనూ తనిఖీలు నిర్వహించినట్టు ఈడీ తెలిపింది. 

బెట్టింగ్ యాప్స్ కి కూడా..

గొర్రెల స్కాం కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ అంశం కూడా తెరపైకి వచ్చింది. ప్రైవేటు వ్యక్తులు తీసిన బ్యాంకు ఖాతాలు గొర్రెలకు సంబంధించిన నగదును బదిలీ చేసుకోవడంతోపాటు ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ కు కూడా వినియోగించినట్టు తెలుస్తోంది. అయితే వీళ్లు హ్యాబిచువల్ అఫెండర్సా..? లేదా డబ్బులు బాగా రావడంతో ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడి పెట్టారా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఆ 200 ఖాతాలు ఎవరివి..? ఏ బ్యాంకులో తీశారు..? ఎలా ట్రాన్సాక్షన్స్ చేశారు..? అన్నది చర్చనీయాంశంగా మారింది.