ఆఫ్రికాలో పూసల్​ మీడియా

ఆఫ్రికాలో పూసల్​ మీడియా

లైఫ్​లోప్రతి విషయం షేర్​ చేసుకునే రోజులివి. ఫేస్​బుక్​, వాట్సాప్​, ఇన్​స్టా, ట్విటర్​.. సోషల్​ మీడియాలో లేనివాళ్లు లేరు. ఇవేమీ లేని  రోజుల్లో ఎట్లా ఉండేవారో అనుకుంటూ మీమ్స్​ చూస్తూ ఎంజాయ్​  చేస్తుంటాం. కానీ  సోషల్ మీడియా 50 వేల ఏండ్ల క్రితమే ఉందంటే నమ్మగలమా...

ఇన్ఫర్మేషన్​ షేర్​ చేసుకోవడానికి ప్రతి కాలంలోనూ ఏదో ఒక మీడియా ఉండేది. రాజుల శిలాఫలకాలు, శాసనాలు ఇలాంటివే. ఇవి హిస్టరీని షేర్​ చేసేవి. ప్రింట్​, డిజిటల్​ మీడియా వచ్చాక ఇన్ఫర్మేషన్​ పంచుకునే వేగం పెరిగింది. ఇటీవల ఆఫ్రికాలోని ఆర్కియాలజిస్ట్​ల రీసెర్చ్ ​నమ్మలేని ఓ నిజాన్ని వెల్లడించింది. 

పదేళ్ల పరిశోధన
ఆఫ్రికన్​ ఆర్కియాలజిస్ట్​ల అన్వేషణలో 1,500 పూసలు దొరికాయి.  వాటిని పదేళ్ల పాటు రీసెర్చ్​ చేశారు. అవన్నీ ఆస్ట్రిచ్​ ఎగ్ షెల్స్​తో చేసిన పూసలు. చివరికి ఆ పూసలన్నీ ఒక రకమైన సోషల్​ నెట్​వర్క్​ను ప్రెజెంట్​ చేసేందుకు వాడినవని చెప్పారు. డోనట్​ ఆకారంలో ఉండే పూసలు సాధారణ అలంకారాల్లో, సంప్రదాయానికి ప్రతీకగా వాడారు. సదరన్​ ఆఫ్రికాలో ఇప్పటికీ కొన్ని తెగలవాళ్లు ఈ టైప్​ పూసలు వాడుతున్నారు.

పూసల ఊసులు
పూసలను తయారు చేశాక వాటి మీద సింబాలిక్​ మెసేజ్​లు చెక్కేవారు. అవి సందర్భానికి తగ్గట్టుగా ఉండేవి. ఇప్పుడు వెడ్డింగ్​ రింగ్​ మీద పేర్లు రాస్తున్నారు కదా. ఆ పూసల రాతలు కూడా అలాంటివే. అలా పూసలు దండగుచ్చి షేర్​ చేసుకునేవాళ్లని చెప్పారు ఆర్కియాలజీ రీసెర్చర్​ జెనిఫర్​ మిల్లర్​. ఈ పరిశోధన కోసం తూర్పు, దక్షిణ ఆఫ్రికాల్లోని 31 ప్రాంతాల్లో అన్వేషించి పూసలు సేకరించారు. ఇవన్నీ సుమారు 50 వేల ఏండ్లనాటివని తేల్చారు. పూసల మందం, ఆకారం, కొలతలు వంటివి విభజించుకుంటూ ఏ ప్రాంతం వాళ్లు ఎలాంటి పూసలు వాడారో తెలుసుకున్నారు. ఈ 31 ప్రాంతాలూ 3000 కి.మీ. పరిధిలో ఉన్నా.. కొన్ని కొన్ని పూసలు ఒకే రకమైనవి తయారు చేసుకున్నారు. అంటే.. ఒక విషయం అందరికీ ఒకేలా షేర్​ అయినట్టే కదా.

అప్​డేట్​ అయ్యారు
అతి పురాతన పూస తూర్పు ఆఫ్రికాలో దొరికింది. అంటే.. అక్కడి నుంచి ఆఫ్రికా మొత్తానికి నెట్ వర్క్​ మొదలైందని చెప్పొచ్చు. శిలాయుగానికి ఇదొక స్టయిలిస్టిక్​ కనెక్షన్​ అని చెప్తారు రీసెర్చర్స్​. అయితే 33,000 ఏండ్ల కిందట ఈ కనెక్షన్​ బ్రేక్​ అయింది. ఈస్ట్​ ఆఫ్రికాలో మాత్రం కొంత కాలం ఈ స్టయిల్​ కంటిన్యూ అయింది. మరికొన్ని శతాబ్దాల తర్వాత పూసల స్టయిల్​, కలర్స్​ అన్నీ బాగా మారాయి. నాగరికతలో మార్పు ఈ దండల్లోనూ కనిపించేది. దక్షిణ భాగంలో కొన్ని ప్రాంతాల్లో విపత్తుల తర్వాత ఈ కళ గాడి తప్పినట్టు ఉంది.  సంప్రదాయాల కొనసాగింపు సడెన్​గా ఆగిపోవడం, పూసల తయారీ టెక్నిక్​ సరిగ్గా తెలియకపోవడం వంటి కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో ఈ ట్రెండ్​ ఆగిపోయింది.